అశ్వాపురం, జూలై 12: అనుముల రేవంత్‌రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఇలాంటి నోటిదురుసు ముఖ్యమంత్రిని మునుపెన్నడూ చూడలేదని ఎద్దేవాచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రాద్రి రాముడిపై రేవంత్‌రెడ్డి ఒట్టువేశారని, డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. అశ్వాపురంలో ఆదివారం పర్యటించిన అజయ్.. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి మాట్లాడారు. మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ హైదరాబాద్‌లో రైతులు అడిగితే.. ప్రతిపక్ష నేతల రక్తం పారిస్తామంటూ రేవంత్‌రెడ్డి నోరుపారేసుకోవడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రైతులకు నీళ్లివ్వడానికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ముఖ్యమంత్రికి సోయి లేదని విమర్శించారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీరు ప్రవహిస్తోందని, 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చని అన్నారు. కన్నెపల్లి వద్ద వంద రోజులపాటు ఇదే తరహా ప్రవాహం ఉంటుందని, రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లనూ నింపవచ్చునని అన్నారు. వాటి ఆయకట్టులోని భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాపం పండిన రోజు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికీ పడుతుందని అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే మేడిగడ్డ నుంచి భద్రాచలానికి 25 లక్షల క్యూసెకుల వరద వచ్చిందని అజయ్ గుర్తుచేశారు. అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం.. ఇప్పుడు లక్ష క్యూసెకుల ప్రవాహానికే ఎలా కొట్టుకుపోతుందని ప్రశ్నించారు. భద్రాచలం కొట్టుకుపోతుందనే కారణంతోనే మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచామని సీఎం తప్పుడు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మే అంత అమాయకులు ఈ ప్రాంత ప్రజలు కాదని తేల్చిచెప్పారు. కాళేశ్వరం నీళ్లిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే భయంతోనే అక్కసును ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అందుకే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని మండిపడ్డారు. మన పీకల మీద కడుతున్న పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముప్పు వస్తుంది తప్ప మేడిగడ్డ వల్ల కాదని అన్నారు. అయినప్పటికీ భద్రాచలానికి ముప్పంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్నవి కేవలం కల్పిత ప్రచారాలనేనని స్పష్టం చేశారు. యూరియా దొరకడం లేదంటూ రైతులు రోడ్డెకితే వారు అసలు రైతులే కాదనడం హాస్యాస్పదమని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పడకేసిందని అజయ్ విమర్శించారు. తమ బీఆర్ఎస్ పాలనలో పినపాక నియోజకవర్గంలో బీటీపీఎస్‌ను నిర్మించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేశామని, నూతన కలెక్టరేట్లు నిర్మించిన పాలనను ప్రజలకు చేరువ చేశామని, మొత్తంగా అభివృద్ధిని వేగవంతం చేశామని వివరించారు. అయితే, రేవంత్ పాలన మొదలై 30 నెలలు గడుస్తున్నా ఇక్కడి సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బరాజ్‌లు వివక్షత గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకడి నీళ్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి చూపిస్తున్న ఉత్సాహం.. స్థానిక చెరువులను నింపడానికి మంత్రులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ విమర్శలకు బీఆర్ఎస్ భయపడబోదని స్పష్టం చేశారు. మరింత ఘాటుగా స్పందిస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నించారు. రైతుభరోసా సాయాన్ని ఒకటీ రెండు ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అలాగే, అత్తా కోడళ్లకు ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకూ ఒకో మహిళకు రూ.1.50 లక్షల వరకూ బాకీ పడ్డారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉచిత విద్యుత్‌కు, రైతు డిసమ్కు లింక్ పెట్టి ఉచిత కరెంట్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎలా ఉండేవో ప్రజలందరికీ తెలిసినవేనని అన్నారు. ఆ తరువాత బీఆర్ఎస్ పాలనలో నిరంతరాయంగా అందిన విద్యుత్‌ను కూడా ప్రజలు గమనించారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చినప్పుడు కేవలం 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉండగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే కొత్త విద్యుత్ ప్లాంట్లు పెట్టి 19 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని వివరించారు.