మామిళ్లగూడెం, ఏప్రిల్ 25: చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్‌గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీమలపాడు ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని అన్నారు. చనిపోయిన కుటుంబాల వారికి చీమలపాడులో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని, గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు.
వైకల్యం పొందిన వారు ఆరోగ్యవంతులైన తర్వాత కృత్రిమ కాళ్లు అందిస్తామని, వారి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లలకు వారు కోరుకున్న చోట రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తామన్నారు. అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆ ఘటనను తాను కళ్లారా చూశానని, తన జీవితంలో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఏం చేయాలో అంతా చేస్తామని అన్నారు. నామా ముత్తయ్య ట్రస్ట్ నుంచి కూడా సహాయం చేశామన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు మృతిచెందారని, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఏవైనా ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే.. వారిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా వస్తుందని, కానీ మంత్రి ప్రత్యేక చొరవతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం మంజూరైందని వివరించారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. అతిత్వరలో ఎక్స్‌గ్రేషియా అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఎన్.వెంకటేశ్వరరావు, ఆర్డీవో రవీంద్రనాథ్, సింగరేణి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ మాలోత్ శకుంతల, చీమలపాడు సర్పంచ్ కిశోర్ తదితరులు ఉన్నారు.
సహాయం అందుకున్న వారు వీరే..
మృతులు అజ్మీరా మంగు, బాణోత్ రమేశ్, ధర్మసోత్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున మంత్రి అజయ్ చెక్కులు అందించారు. గాయపడిన వారిలో నారటి వెంకన్న, తేజవాత్ భాస్కర్, అంగోత్ కుమార్, దేవ నవీన్‌కుమార్, కనగాల శ్రీనివాస్ ఉండగా వారి కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.