జూలూరుపాడు, మే 3 : ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి.. అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరుతూ జూలూరుపాడు మండలం బేతాళపాడు పంచాయతీ పరిధిలోని రేగళ్లతండాకు చెందిన గిరిజనులు శనివారం వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పేదలకు ఇండ్లు కేటాయించకుండా ఆస్తులు ఉన్న వారికి కేటాయించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దు చేసే వరకు కిందికి దిగేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పినప్పటికీ తమకు న్యాయం జరిగే వరకు దిగమంటూ తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి నిరసన విరమించారు. అయితే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన చౌడం వెంకటేశ్వర్లు, బానోతు కళ్యాణ్, బానోతు కవిత, ధారావత్ నాగమణి, బానోతు బిందు, బానోతు సునీత, ధారావత్ బాబులపై పంచాయతీ కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు.
టేకులపల్లి, మే 3 : నిరుపేదలను వదిలి.. డబ్బులు ఇచ్చిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని తడికలపూడి, తావుర్యాతండా ప్రజలు ఆరోపించారు. ఆయా గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం అధికారులు శనివారం వెళ్లడంతో పలువురు గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. అర్హులైన నిరుపేదల ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉండగా.. డబ్బులు తీసుకొని జాబితాలో పేర్లు చేర్చడం ఏమిటని మండిపడ్డారు. అలాంటప్పుడు గ్రామాల్లో తిరుగుతూ సర్వేలు ఎందుకు చేయాలని, డబ్బులు ఇచ్చిన వారి పేర్లే రాసుకోండి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.