చండ్రుగొండ, మే 14 : మిల్లర్లు తరుగు పేరుతో దోపిడీ చేయడంపై చండ్రుగొండ మండలం రావికంపాడు కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పది రోజుల క్రితం కాంటా వేసిన ధాన్యం నుంచి మిల్లర్లు క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నేటికీ ధాన్యం దిగుమతి కాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. దీనిపై అధికారులను అడిగితే.. డబ్బులు ముందస్తుగా మిల్లర్లకు ఫోన్ పే, ఇతర పద్ధతిలో చెల్లిస్తే వెంటనే ఎగుమతి, దిగుమతి చేస్తామని చెబుతున్నారని వాపోయారు. మిల్లర్ల దోపిడీపై అధికారులకు తెలిపినా సొసైటీ సిబ్బంది, అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్ల మాకు న్యాయం జరగడం లేదన్నారు.
నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి, మిషన్లతో తూర్పార బట్టినప్పటికీ కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. తరుగు పేరుతో తమను దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చట్టపరంగా చర్య తీసుకోవాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని బేషరతుగా మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు కూసాల శ్రీను, గిన్నె నాగిరెడ్డి, పెండ్యాల కృష్ణారావు, ఇనుముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానం..
తరుగు కోసం కొత్తగా మిల్లర్లు క్వింటాకు ఏడు కేజీల వరకు నగదు అకౌంటు, ఫోన్ పే ద్వారా రైతులు చెల్లిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని చెబుతున్నారు. సొసైటీ సిబ్బంది ద్వారానే రైతులను డబ్బులు అడుగుతున్నారంటే వారి దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇందులో అధికారుల పాత్రపై కూడా అనుమానం కలుగుతోంది.
-ఇనుముల వెంకటేశ్వర్లు, రైతు, రావికంపాడు, చండ్రుగొండ మండలం
అన్యాయం జరిగినా పట్టించుకోరా?
అధికారులకు అన్నీ తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మిల్లర్ల దోపిడీపై అధికార పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో వారికే తెలియాలి. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకోవడం లేదు. పంట వేసినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేంత వరకు రైతులకు అన్నీ కష్టాలే.
-గిన్నె నాగిరెడ్డి, రైతు, రావికంపాడు, చండ్రుగొండ మండలం
మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలి?
ఒకవైపు వర్షాలు.. మరోవైపు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ. క్వింటాకు ఐదు నుంచి ఏడు కేజీల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా సొసైటీ సిబ్బంది ద్వారానే అడిగిస్తున్నారు. మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు కనీసం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తరుగు దోపిడీపై విచారణ చేపట్టాలి.
-పూసాల శ్రీను, రైతు, రావికంపాడు, చండ్రుగొండ మండలం