కారేపల్లి, మార్చి 24 : డెయిరీ ఫామ్ నిర్వహణతో పూర్వీకుల కాలం నుండి ఉన్న దళిత స్మశాన వాటికను వినియోగంచుకోలేక పోతున్నామని, కావునా అక్కడి నుంచి డెయిరీ ఫామ్‌ను తరలించి స్మశాన వాటికకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి భారత్‌నగర్ కాలనీవాసులు సోమవారం అధికారులను వేడుకున్నారు. సమస్యను విన్నవిస్తూ కాలనీవాసులలతో కలిసి ఎంపీడీఓ, ఎంపీఓ, మండల నీటి పారుదల శాఖ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాలనీవాసులు స్థానిక సంత సమీపంలో గల కలాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సుబ్బయ్యకుంట సమీపంలో పూర్వం నుండి దళితుల స్మశాన వాటికను ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. తమ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఆచారం ప్రకారం స్మశాన వాటికలోనే క్రతువులు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల స్మశాన వాటికకు సమీపంలో ఓ వ్యక్తి శ్రీరామ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంతో సుమారు 200 బర్రెలకు సంబంధించిన పేడ, ఇతర వ్యర్థ పదార్థాలు స్మశాన వాటికలోకి రావడం వల్ల సమాధులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతూ దుర్వాసన వస్తుండడంతో స్మశాన వాటికను ఉపయోగించుకోకుండా ఇబ్బందికరంగా మారిందని విచారం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఈ డెయిరీ ఫామ్ నుండి వదిలే పదార్థాలన్నీ సుబ్బయ్యకుంటలో కలవడం వల్ల నీళ్లు కలుషితమై తమ కాలనీ ప్రజలు స్నానాలు చేసేందుకు, ఇంట్లో వాడకానికి ఇబ్బందిగా మారుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశాన వాటికకు డెయిరీ ఫామ్ నుండి రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కాలనీ పెద్దలు తలారి దేవ ప్రకాశ్, మైపా నరసయ్య, మైపా పీరయ్య, సోమందల రాములు, ఆదర్ల రాముడు, చెవుల శ్రీను, వెంకటాద్రి, తులసిమొక్క శ్రీరాములు, సోమందల నాగరాజు, చెవుల చందు, తడికమల్ల భద్రం, మేదరి ప్రతాప్, ఎల్లంకి పిచ్చయ్య, తలారి అనిల్, ఆదర్ల బాలకృష్ణ, మేదరి రాజా పాల్గొన్నారు.