– ప్రజావాణిలో ఎర్రుపాలెం ఎంపీవో కృష్ణకు బీఆర్ఎస్ నేతల వినతి
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందించాలని ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రుపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీవో కృష్ణకు బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రంలో ప్రధానంగా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం అందించాలని, రైతులకు ప్రతి పంటకు రైతుభరోసా, పంటలకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. విద్యార్థులకు విద్యాభరోసా కల్పించడంతో పాటు పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలన్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెంచిన రూ.4 వేల పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన, రైతు వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, ప్రభుత్వ హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ గూడూరు రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ కుడుముల మల్లికార్జున రెడ్డి, నాయకులు బొర్ర నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, కుక్కల అఖిల్, అశోక్, వెంకటరెడ్డి, పొదిల శివరాజ్, గుమ్మా శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.