కారేపల్లి, ఏప్రిల్ 02 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సింగరేణి మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో పలు సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలలో తాము అందజేసిన దరఖాస్తుల పురోగతిపై సంబంధిత అధికారులను ప్రజలు నిలదీశారు. గాదెపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఫారెస్ట్, విద్యుత్ శాఖ నుండి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూములలో అటవీ శాఖ అధికారులు విద్యుత్ లైన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పోడు సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి గ్రామ పంచాయతీలో ప్రధాన రహదారి వెంట సైడ్ కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అనేకచోట్ల గ్రామ సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఉండగా ప్రజలు లేకపోవడంతో ఆలస్యంగా అధికారులు ప్రారంభించారు. అన్ని గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు గత ఏడాది కాలంలో పంచాయతీకి వివిధ రూపంలో వచ్చిన నిధులు, ఖర్చులను సభలో చదివి వినిపించారు. ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ గ్రామ సభల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.