కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 6 : కొత్తగూడెం పట్టణంలో ఇంటి యజమానులు దశాబ్దకాలంగా ఎదుర్కొంటున్న ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్యకు గత కేసీఆర్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి యజమానులు నిర్మించుకున్న ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు ఎలాంటి అధికారిక ధ్రువపత్రాలు ఎవరి వద్దా లేవు. కేవలం ఇంటి నెంబర్లపైనే ఆధారపడి క్రయవిక్రయాలు చేసుకున్నారు. దీనివల్ల ఆస్తులకు అధికారికంగా గుర్తింపు లేకపోవడంతోపాటు బ్యాంకు రుణాలు కూడా లభించే పరిస్థితి లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వినతి మేరకు సీఎం కేసీఆర్ జీవో 76 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. మొత్తం మూడు విడతలుగా ఈ జీవోను విడుదల చేసి సాధారణ ఫీజు చెల్లించే విధంగా ఇంటి క్రమబద్ధీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలుత 2014, జూన్ 2వ తేదీ వరకు, ఆ తర్వాత 2020, జూన్ 2వ తేదీ వరకు నిర్మించుకున్న ఇంటికి పట్టాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు.
అక్టోబర్లో శాసనసభ ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయినప్పటికీ ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక మరోసారి మార్చిలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో పట్టాల పంపిణీ ప్రక్రియ అటకెక్కింది. సుమారు తొమ్మిది నెలలుగా ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల సర్వే, పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
తొలివిడతలో సుమారు 7 వేల దరఖాస్తులు రాగా.. 4,700 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేశారు. రెండో విడతలో సుమారు 1,500లకుపైగా దరఖాస్తులు రాగా.. 400లకుపైగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలను గత మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అందించారు. ఇక మూడో విడత 2,200 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 100కు పైగా దరఖాస్తును సర్వే పూర్తి చేశారు. మిగిలిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పట్టాలను అందించాలని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. కానీ.. శాసనసభ ఎన్నికల కోడ్ అమలుల్లోకి రావడంతో ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల కోసం ఎదురుచూస్తున్న వారి కల సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలని ఇంటి యజమానులు కోరుతున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమబద్ధీకరణ పట్టాల సర్వేను నిలిపివేశాం. మళ్లీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత దరఖాస్తులను సర్వే చేసి అర్హులను గుర్తించి క్రమబద్ధీకరణ పట్టాలను అందిస్తాం.
– డి.పుల్లయ్య, కొత్తగూడెం తహసీల్దార్