దుమ్ముగూడెం, మే 5 : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రేషన్ కార్డుల జాబితా తప్పులతడకగా ఉంటోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ప్రవేశపెట్టిన కొత్త జాబితాను చూస్తే కంగుతినాల్సిందే. ఆయా పంచాయతీల్లో అధికారులు కొత్త రేషన్ కార్డుల జాబితా చదివి వినిపించారు. వాటిలో తమ పేర్లు రావడంతో లబ్ధిదారులు సంబురపడ్డారు.
తీరా చూస్తే తప్పులతడక విషయం బయటపడింది. సూరారం గ్రామానికి చెందిన కాశిబోయిన సతీష్‌కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ.. తల్లిదండ్రుల పాతకార్డులోనే తన పేరుతోపాటు భార్య, పిల్లల పేర్లు యాడ్ కావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అధికారులను ప్రశ్నించగా.. పాత రేషన్ కార్డులో పేర్లు డిలీట్ చేసి కొత్తకార్డు మంజూరు చేస్తామని సమాధానమిచ్చారు.
చిన్నబండిరేవు గ్రామానికి చెందిన బొందెల సమ్మయ్య కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోగా.. తన పేరుతోపాటు ఇద్దరు పిల్లల పేర్లు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామంలోని తన అత్త రేషన్ కార్డులో కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే.. తెలియదంటూ తెల్లముఖం వేశారు. ఇలా తప్పులతడకగా రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఎలా అంటూ పలువురు మండిపడుతున్నారు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తప్పులు దొర్లుతున్నాయని ఆరోపిస్తున్నారు.