తిరుమలాయపాలెం, జూలై 15: పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో కొద్ది రోజులుగా ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి సోమవారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. కాలనీలన్నీ కలియదిరిగి అపరిశుభ్ర వీధులను పరిశీలించారు. ఆయా ఇళ్లకు వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వీధుల్లో అపరిశుభ్రతను మెరుగుపర్చాలని ఆదేశించారు. జల్లేపల్లిలో జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. రోగులకు మందులు అందజేయాలని, గ్రామంలో దోమతెరలు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ అధికారులతో మాట్లాడుతూ.. జ్వరాలు వచ్చే వరకు చూడకుండా అధికారులే ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే 20 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అపరిశుభ్రంగా మురుగు కూపాలుగా మారిన వీధులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. పంచాయతీ కార్యదర్శి ధనమ్మపైనా, మరికొందరు అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బోడ మంగీలాల్, బెల్లం శ్రీనివాసరావు, మాలతి, శేషాద్రి, రామకృష్ణ, రామారావు పాల్గొన్నారు.