మామిళ్లగూడెం, జూలై 8 : వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సమర్పించిన అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్తో కలిసి పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిషరించాలని తెలిపారు. ధరణి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను ఆన్లైన్లో పరిశీలించి వాటి పరిషారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం నుంచి పాశం బ్రహ్మారెడ్డి, ఖానాపురానికి చెందిన భట్టు నాగమణి, బోనకల్ మండలం రావినూతలకు చెందిన బి.మంగమ్మ, తల్లాడ మండలం పినపాకకు చెందిన ఎస్కే.మైబూబీ, చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జాన్ సాహెబ్, కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన మాచర్ల సైదమ్మ తదితరులు తమ తమ సమస్యలపై వినతులు సమర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో ఎస్.వినోద్, డీఆర్వో ఎం.రాజేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.