ఖమ్మం, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ), జూలై 26 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకాధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా భారీ వర్షాలు, వరదలు, యూరి యా నిల్వలు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డుల మంజూరు తదితర అంశాలపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఖమ్మంజిల్లాలో మున్నేరు వరద పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాల వల్ల ఏ ఒక్కరికీ హాని జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆపదమిత్ర వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా అధికారులు యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం ఖమ్మంలో మున్నేరు 7.5 అడుగులు మాత్రమే ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రస్తుతం 3వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో 2,500 మెట్రిక్ టన్నులు రెండ్రోజుల్లో జిల్లాకు చేరుకుంటుందన్నారు.
ఖమ్మం నుంచి కమిషనర్ అభిషేక్ అగస్త్య, సీపీవో శ్రీనివాస్, సివిల్ సైప్లె డీఎం శ్రీలత, డీఏవో పుల్లయ్య, డీఎంహెచ్‌వో కళావతిబాయి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ గోదావరిలో నీటిమట్టం ప్రస్తుతం 33 అడుగులు ఉందన్నారు. జిల్లాలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు ఒకటి భద్రాచలం, మరొకటి పాల్వంచలో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.