భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో పలు సమస్యలపై బాధితులు సమర్పించిన దరఖాస్తులు అంతంతమాత్రంగానే పరిష్కారమవుతున్నాయి. కలెక్టరేట్లో వారం వారం ప్రజావాణి(గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతున్నా.. ఇందులో రద్దు చేసిన కార్యక్రమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.
మాది ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహణలో క్షేత్రస్థాయిలోనే విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సి ఉండగా.. వివిధ పనుల్లో బిజీగా ఉండడం వల్ల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలే ఆ కార్యక్రమాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ అపరిష్కృత సమస్యలపై వినతులు సమర్పించినా ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో ప్రజలు విసుగు చెందుతున్నారు. దీనికి అర్జీలు సమర్పించడం ఎందుకని చర్చించుకుంటున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతి సోమవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించాల్సిన ప్రజావాణికి చాలా మంది అధికారులు వివిధ సాకులు చెప్పి డుమ్మా కొడుతున్నారు. కనీసం కిందిస్థాయి ఉద్యోగులు కూడా గ్రీవెన్స్‌కు హాజరుకావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 49 వారాలపాటు జరిగిన ప్రజావాణిలో 24 సోమవారాలు కొన్ని కారణాల వల్ల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇందులో కొన్ని పండుగ సెలవు దినాలు వస్తే.. మరికొన్ని మంత్రుల పర్యటనలు, భద్రాచలం వద్ద వరదలు తదితర కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టరేట్ అధికారులు ప్రకటించారు. ఇందులో గత కలెక్టర్, ప్రస్తుత కలెక్టర్లు 15 గ్రీవెన్స్‌లకు హాజరు కాగా.. మరో 10 గ్రీవెన్స్‌లకు అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఒకానొక దశలో అదనపు కలెక్టర్ కూడా లేకుండా గ్రీవెన్స్ నిర్వహించిన సందర్భాలున్నాయి.
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల భూ సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నట్లు సమాచారం. అయితే వాటికి పరిష్కారం లభించకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు సమర్పించిన వారు ఇంతమాత్రానికి గ్రీవెన్స్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించాలని, తల్లిదండ్రులు చూడడం లేదని, వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రైతుబీమా, రైతు భరోసా రావడం లేదని, పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని పేర్కొంటున్నారు.
లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలో తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని గిరిజన బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 2,367 ఫిర్యాదులు రాగా.. అందులో 1,169 పరిష్కారం అయినట్లు అధికారులు లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. 843 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 355 దరఖాస్తులను ఆయా శాఖలకు పంపించినట్లు లెక్కలు చూపించారు.
ప్రతి గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు అర్జీలు ఇవ్వాలా.. వద్దా.. అని సంశయిస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చినా మా సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్ సమక్షంలో ప్రజావాణి నిర్వహిస్తే మేలు జరుగుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు మంత్రులు వస్తే ప్రజావాణి బంద్ పెడుతున్నారు. ఇక ప్రజావాణికి వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటి. ప్రైవేటు స్కూల్స్‌లో టెట్, బీఈడీ లేకుండానే విద్యాబోధన చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. మంత్రుల పర్యటన సందర్భంగా ప్రజావాణి రద్దు చేయడం ఎంతవరకు సమంజసం.
-మూడ్ బాలాజీనాయక్, విద్యార్థి సంఘం నాయకుడు, చండ్రుగొండ
భద్రాచలం పట్టణంలోని తాతగుడి సెంటర్లో దేవుడి స్థలాన్ని కొందరు పెద్దలు కబ్జా చేశారు. నేను ఇప్పటికీ అక్కడే పూజలు చేస్తున్నా. ఆ భూమిని రక్షించాలని ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. ఆర్డీవో, పీవో, కలెక్టర్ సార్లందరికీ వినతులు ఇచ్చాను. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుందో మీరే చెప్పండి.
-రెహమాన్, భద్రాచలం