ఖమ్మం రూరల్, మే 12 : ఈ నెల 14వ తేదీన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టివి రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురంలో తొలిసారిగా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు.
తొలి విడతలో క్లస్టర్ వన్ సంబంధించి 15 వార్డుల ప్రజా సమస్యలను తెలుసుకుని వినతులు స్వీకరించి అర్హత కలిగిన వినతులకు అక్కడే పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ జ్యోతి, రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు భరోసా, స్త్రీ శక్తి రుణాలు, రోడ్లు, భవనాలు ఇతర సమస్యలు ఉన్నటువంటి ప్రజలు దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.