CM KCR | ఖమ్మం, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాపరిధిలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందులో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నిండింది. సభలకు భారీగా ప్రజలు విచ్చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఉమ్మడి జిల్లాలో మూడు సభలు నిర్వహించడం విశేషం. నోటిఫికేషన్ తర్వాత సీఎం కేసీఆర్ ఆదివారం మరో రెండు సభలకు విచ్చేయనున్నారు. దీన్నిబట్టి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఎంత దృష్టి సారించారో అర్థం చేసుకోవచ్చు. సభల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 27న పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన తీరు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విమర్శించిన విధానంపై సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘తుమ్మలకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందా..? బీఆర్ఎస్కు తుమ్మల ద్రోహం చేశారా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి తుమ్మలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ చురకలు అంటించారు. ‘కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటును తాకనివ్వం’ అని అంటున్నారని, ప్రజల శక్తి ముందు వారంతా కొట్టుకుపోతారని ప్రకటించడంపై హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సీఎం కేసీఆర్ పరోక్షంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారశైలిని సభాముఖంగా ఎండగట్టారు. అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని చేసిన పొంగులేటి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. అలాగే ఇల్లెందు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ‘ఉద్యమాల గడ్డ.. పోరాటాల పురిటిగడ్డ ఇల్లెందు’ అని ప్రస్తావించినప్పుడు సభికులు కేరింతలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యమేనంటూ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభ మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మూడురోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మంత్రి పువ్వాడతో కలిసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఖమ్మం నగర పరిధిలోని అన్ని డివిజన్లతోపాటు రఘునాథపాలెం మండలంలోనూ బీఆర్ఎస్ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నాయి.
2018 శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు విచ్చేశారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపించాలని సభాముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌కుమార్ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. కొత్తగూడెంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలకు భారీగా జన సమీకరణ చేసేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఖమ్మంలో సభ పూర్తి కాగానే సీఎం వెంటనే హెలికాఫ్టర్‌లో కొత్తగూడెం చేరుకుని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ రాక కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.