చింతకాని, జూలై 7 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు, అసమర్ధ పాలనతో రైతు ప్రభాకర్ బలయ్యాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఆదివారం మండలంలోని ప్రొద్దుటూరులో పెంట్యాల పుల్లయ్య నివాసానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందం, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభాకర్‌కు 7ఎకరాల 10 గుంటలకు పట్టా ఇచ్చి రైతుబంధు డబ్బులు 11సార్లు చెల్లించారన్నారు. రైతులందరికీ విషయం తెలుసునని అన్నారు. తన పంట పొలాన్ని ప్రొక్లెయిన్ల ద్వారా కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్నా.. రైతులు ప్రేక్షకుల్లా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క గెలుపులో ప్రభాకర్ కుటుంబం పాలుపంచుకున్నట్లు వీడియో ద్వారా ప్రభాకర్ చెప్పాడని అన్నారు.
ప్రభాకర్ కుటుంబ పరామర్శకు వచ్చిన భట్టి నిందితుని ఇంటికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని అయినా పార్టీ పరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రభాకర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన పెంట్యాల పుల్లయ్యపై A3గా కేసు నమోదుచేయడమే కాకుండా అసలు పాత్రధారి అయిన వ్యక్తిని A12లో నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌లో కేసు దరఖాస్తు రాసిన పెంట్యాల నాగుల్‌మీరాను A1గా నమోదుచేశారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అప్పుడు చర్యలుంటాయని అన్నారు. జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ.. బాధిత రైతు ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాష్ట్ర నాయకులు రాకేశ్‌రెడ్డి, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బెల్లం వేణు, రమణ, చిత్తారు నాగేశ్వరరావు, గురజాల హనుమంతరావు, మంకెన రమేష్, గడ్డం శ్రీనివాసరావు, బోడ్డు వెంకట్రామారావు, బండి రామారావు, వేముల నర్సయ్య, పిన్నెల్లి శ్రీను, కోల్లి బాబు, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.