ఖమ్మం, నవంబర్ 16: వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కోవడం అన్యాయమని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. మూడు రోజులుగా ఖమ్మంలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేద, చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం, అక్రమ కేసులతో వారిని జైళ్లకు పంపడం అన్యాయమని అన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో ఉన్న రేవంత్‌రెడ్డిలు.. ఫార్మా కంపెనీలకు ఏజెంట్లలా పనిచేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు మల్లన్నసాగర్ విషయంలో ఏమి మాట్లాడారో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం సరైంది కాదని హితవుచెప్పారు. ఇటీవలి ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ నెల 19న లగచర్ల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని రంగారావు విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్న రేవంత్ సర్కారు.. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అసలు అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తేమతో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, అన్ని రకాల ధాన్యానికీ బోనస్ ఇవ్వాలని, ఆయా ధాన్యాలను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నేలు కేజీ రామచందర్, కే రమ, కెచ్చెల రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వరరావు, చిన్న చంద్రన్న, గుమ్మడి నర్సయ్య, కృష్ణ, ప్రభాకర్, సదానందం, సూర్యం, ఎం.కృష్ణ, అరుణ, కృష్ణారెడ్డి, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.