కారేపల్లి, జనవరి 30 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ బస్టాండ్ సెంటర్లో లారీ-స్కూటీ ఢీకొని పోస్టల్ ఉద్యోగికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం జోగుగూడెం తపాలా శాఖ బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం)గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ తన స్కూటీపై కారేపల్లి వైపు నుండి జోగుగూడెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారేపల్లి క్రాస్ రోడ్ బస్టాండ్ సెంటర్లో జోగుగూడెం వైపు మూలమలుపు తిరుగుతుండగా ఖమ్మం నుండి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కారేపల్లి ఎస్ఐ బైరు గోపి క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందినవాడిగా తోటి ఉద్యోగులు తెలిపారు.