కారేపల్లి, జూన్ 2 : అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారేపల్లి మండలం పేరుపల్లి పంచాయతీకి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు, దరఖాస్తుదారులు మాట్లాడుతూ పేరుపల్లి పంచాయతీ పరిధిలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న, సంపన్న కుటుంబాలకు ఇందిరమ్మ కమిటీలు ఇండ్ల జాబితాలో చోటు కల్పించి రహస్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు.
ఉన్నతాధికారులు జాబితాను పరిశీలించి నిరుపేదలు, పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న వారికి ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇండ్లు మంజూరు చేయని పక్షంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పప్పుల వెంకటేశ్వర్లు, అంబేదర్ సేన జిల్లా కో కన్వీనర్ పప్పుల నిర్మల, దరఖాస్తుదారులు, నిరుపేదలు అజ్మీరా సరిత, శంకర్, దారా బకయ్య, అజ్మీరా నగేష్, దారా రాంబాబు, పాయం భిక్షపతి, రవి, గుగులోత్ సుభద్ర, కోటం నాగమణి, అజ్మీరా లక్ష్మి, విక్రమ్, గడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు.