భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (నమస్తే తెలంగాణ) : అలవిగానీ హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. అరకొరగా ఇస్తున్న కొన్ని పథకాలను పూర్తిగా అనర్హులకే కట్టబెడుతోంది. దీంతో కడుపుమండిన కడు పేదలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. దీంతో ఇటీవల ఎక్కడ చూసినా ఆందోళనలే కన్పిస్తున్నాయి. నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు అన్ని వర్గాల ప్రజలూ అన్ని గ్రామాల్లోనూ తమ తమ సమస్యల పరిష్కారం కోసం, తమకిచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కుతున్నారు.
తమకు న్యాయం చేయాలని, పథకాలను వర్తింపజేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, సకాలంలో వేతనాల కోసం కొన్ని చోట్ల, ధాన్యం కొనుగోళ్లు, నిధుల జమ కోసం మరికొన్నిచోట్ల, ఉపాధి పనులు, తాగునీళ్ల తదితరాల కోసం ఇంకొన్ని చోట్ల.. ఆందోళనపర్వాలే సాక్షాత్కరిస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదైనా ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకోవడం మునుపెన్నడూ చూడని విశేషం.
‘ఎక్కడికెళ్లినా అప్పు పుట్టడం లేదు. నన్ను నిలువునా చీల్చినా ఆర్థికపరమైన హామీలు నెరవేర్చలేను’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాడెత్తేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ.. అదే కాంగ్రెస్ నేతలు.. 16 నెలల క్రితం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలంటూ ఎడాపెడా హామీలిచ్చారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. కానీ.. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పాలకులు తమ అచేతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. అసంపూర్తి రుణమాఫీ, రైతు భరోసాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. ఇటీవల మొదలైన ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్, రేషన్ కార్డుల వంటివి మరింత స్పష్టతనిస్తున్నాయి.
అన్నింటా బొక్కబోర్లా..
హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేకపోతుండడం, కొద్దోగొప్పో అమలు చేస్తున్న పథకాల్లో అనర్హులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అగ్రతాంబూలం వేస్తుండడం వంటి కారణాలతో ఈ ప్రభుత్వంపై నిరుపేదలు భగ్గుమంటున్నారు. రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాక, ధాన్యం కొనుగోలు చేయక, అక్కడ సౌకర్యాలు సమకూర్చక, గన్నీ బ్యాగులు సిద్ధం చేయక, తరుగులో న్యాయం చేయక, ఉపాధిహామీ పనులు కల్పించక, తాగునీరు సరఫరా చేయక, రేషన్ కార్డుల్లో పేర్లు ఎక్కించక, కొత్త కార్డులు ఇవ్వక, వేతనాలు పెంచక, పెంచిన వేతనాలూ ఇవ్వక సర్కారు ధోకా చేస్తుండడంపై ఆయా వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు.
ఎక్కడ చూసినా నిరసనలే..
చుంచుపల్లి మండలం పెనుబల్లిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదంటూ అక్కడి అర్హులు ఇటీవల ఆందోళనకు దిగారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోనూ ఇదే సమస్యపై అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంలో ఏకంగా అధికారులనే అడ్డుకున్నారు. అనర్హులకు ఇండ్లు ఇచ్చే సర్వే వద్దంటూ సర్వేకు వచ్చిన అధికారులను పొలిమేర్ల నుంచే వెనక్కు పంపారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, పాత కార్డుల్లో పేర్లు ఎక్కించమంటే ఉన్న పేర్లను తొలగించారని ఆరోపిస్తూ అనేక గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. దుమ్ముగూడెం మండల లబ్ధిదారుల పేర్లు వేరే జిల్లాలోని రేషన్ కార్డులో ఉన్నట్లు తేలడంతో వారు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌లో తాగునీటి సమస్యపై రోడ్డెక్కినా అతీగతీలేదు. బిందెలు చేతపట్టుకొని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసినా కనీస స్పందన లేదు.
ఇందిరమ్మ ఇండ్లపై నిలదీతలు..
ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ఇండ్ల ఆందోళనలే కన్పిస్తున్నాయి. ఎవరిని పలుకరించినా నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని గోడు వెళ్లబోసుకుంటుండడం గమనార్హం. భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల్లో ఒక్కో మండలం నుంచి ఒక్కో పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ఏడాది జనవరి 26నే మంజూరు పత్రాలు అందజేశారు. ఆ మంజూరు పత్రాలు అందుకున్న వారిలో అందరూ అనర్హులేనని అప్పట్లోనే అర్హులు ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆ పైలట్ గ్రామాలతోపాటు మిగతా గ్రామాల్లో కూడా మొదటి విడత కోసం అర్హుల విచారణ జరుగుతోంది. అయితే, ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన వారిలో ఏ ఒక్కరూ అర్హులు లేరని, అన్ని అర్హతలూ ఉన్న తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయలేదని ఆయా గ్రామాల ప్రజలు సర్వే అధికారుల ఎదుట ప్రతి రోజూ ధర్నాలు చేస్తూనే ఉన్నారు.
నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు..
నాకు రేకుల ఇల్లు ఉంది. పెద్దగాలి వస్తే కూలిపోయే పరిస్థితి. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నా. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇల్లు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చారు. పార్టీలో తిరిగే వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మాలాంటి నిరుపేదల పరిస్థితి ఏమిటి?
-మిరియాల లక్ష్మయ్య, అయ్యన్నపాలెం, చండ్రుగొండ
పింఛన్ రావడం లేదు..
నా భర్త చనిపోయి మూడేళ్లవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. పెంచిన పింఛన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రోజూ చెబుతోంది. కానీ.. ఇంత వరకూ ఇవ్వలేదు. కూలి పనులకు వెళ్లి బతుకు వెళ్లదీసుకునే నేను.. కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. పింఛన్ ఇవ్వకపోతే ఎలా బతకాలి?
-దామర్ల పుల్లమ్మ, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి
ధర్నా చేసినా తాగునీరు ఇవ్వలేదు..
పథకాలే కాదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తాగునీరు కూడా ఇవ్వలేకపోయింది. మాది నెహ్రూనగర్. మా గ్రామంలో తాగునీళ్లు లేకపోవడంతో చాలా దూరం వెళ్లి తెచ్చుకుంటున్నాం. మా గ్రామానికి తాగునీళ్లు ఇవ్వాలంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేశాం. పైపులైన్లు వేసి నీళ్లు ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజుకు కూడా ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.
-వీ.కౌసల్య, నెహ్రూనగర్, ఇల్లెందు