Ponguleti Srinivas Reddy | బోనకల్లు : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలోని బోనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు. గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో గురైన బాధితులకు భరోసా కల్పించారు. ఈనెల 31న బోనకల్లు సమీపంలో ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో యార్లగడ్డ వరమ్మ మృతిచెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు చికిత్స పొంది ఇండ్లకు చేరుకున్నారు. వీరిని ఈ నెల రెండో తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. కానీ తమకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎటువంటి భరోసా కల్పించలేదని బాధితులు వాపోయారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం గానీ, పూర్తిస్థాయి వైద్య వసతులు గానీ కల్పిస్తారని బాధితులు ఆశగా ఎదురు చూశారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సంగతిని రాష్ట్ర సమాచార ప్రసారాలు, రెవెన్యూశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తెచ్చారు. శుక్రవారం మంత్రి పొంగులేటి.. మండల కేంద్రంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అటుపై మంత్రి పొంగులేటి.. బాధితుల కుటుంబాల ఇండ్లకు చేరుకున్నారు. మృతురాలు వరమ్మ చిత్రపటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. వరమ్మ కుమారుడు యార్లగడ్డ శ్రీనివాసరావును ఓదార్చారు.
తీవ్ర గాయాల పాలైన పెద్ద గౌండ్ల వెంకటరమణ, మొర్ల శైలజ, మరీదు శైలజ, మరీదు ధనలక్ష్మి, మరీదు పద్మ, పసల త్రివేణి, గద్దె పుల్లమ్మలను మంత్రి పొంగులేటి పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహకారం అందిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ‘డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు ఎన్నికల సమయంలో మా ఓట్లు కావాలి. కానీ బాధల్లో ఉన్నప్పుడు మాత్రం భరోసా కల్పించని నాయకుడు అండగా నిలబడని నాయకుడు ఎందుకు’ అని పెదవి విరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి దుర్గారావు, పైడిపల్లి కిషోర్, భూక్య సైదా నాయక్, బండి వెంకటేశ్వర్లు, ఉమ్మనేని కృష్ణ, కోటా రాంబాబు, చిలకా వెంకటేశ్వర్లు, కన్నీటి సురేష్, గుగులోతు రమేష్, మరీదు శ్రీను తదితరులు పాల్గొన్నారు.