చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం, భద్రాద్రి జిల్లాలో కొంచెం తగ్గి 82.65 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వారావుపేట మండలంలో తోపులాట, ముదిగొండ మండలంలో స్వల్ప ఉద్రిక్తత వంటి ఘటనలు చోటుచేసుకున్నారు. ఇక, తన ప్రత్యర్థి గెలవొద్దంటూ ఖమ్మం రూరల్ మండలంలో ఓ అభ్యర్థి క్షుద్రపూజలు చేయించాడన్న ప్రచారం కలకలం రేపింది.
అలాగే, నేలకొండపల్లి మండలంలో ఓ స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ రోజే మృతిచెందాడు. ఇక, ఎమ్మెల్సీ తాతా మధు తన స్వగ్రామమైన పిండిప్రోలులో, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సతీసమేతంగా తన స్వగ్రామమైన రాజుపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. ఒంటిగంటలోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 14 : రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎక్కువగా, భద్రాద్రి జిల్లాలో తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, ప్రత్యర్థి అభ్యర్థుల తరఫు నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు.
అశ్వారావుపేట మండలం నారాయణపురంలో ఒంటి గంట దాటిన తరువాత కొందరు ఓటర్లు క్యూలోకి వచ్చారు. ఎన్నికల అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలనూ అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇక, ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులో తన ప్రత్యర్థి అభ్యర్థి గెలవకుండా ఓ అభ్యర్థి క్షుద్రపూజలు చేశాడన్న ప్రచారం కలకలం రేపింది. నేలకొండపల్లి మండలం అనాసాగరం పంచాయతీలో స్వతంత్య్ర అభ్యర్థి దామాల నాగరాజు అనారోగ్యంతో ఆదివారం మరణించారు.
ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో మొత్తం 2,48,239 మంది ఓటర్లు ఉండగా.. 2,26,417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 91.21 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాల్లో 183 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 పంచాయతీలకు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 160 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 306 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం కావడంతో మిగిలిన 1,379 వార్డు స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు.

భద్రాద్రి జిల్లాలో 82.65 శాతం..
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో 82.65 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, చుంచుపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 పంచాయతీలు ఎన్నికలు జరగాల్సి ఉంది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో ఎస్టీ జనాభా లేనప్పటికీ ఆ పంచాయతీని ఎస్టీకి రిజర్వు చేయడంతో అక్కడ నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. అలాగే, ములకలపల్లి మండలం చాపరాళ్లపల్లి పంచాయతీలోనూ ఎన్నికలు జరగలేదు. ఆ గ్రామం మైదాన ప్రాంతమైనప్పటికీ దానిని ఏజెన్సీలో చేర్చి ఎస్టీకి రిజర్వు చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో అక్కడ కూడా ఎన్నిక జరగలేదు.
ఇక మిగిలిన 154 పంచాయతీల్లో 16 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా మిగిలిన 138 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఏడు మండలాల్లో 1,96,395 మంది ఓటర్లు ఉండగా.. 1,62,325 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వగ్రామమైన దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం ఏకగ్రీవం కాగా.. అదే మండలంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణల స్వగ్రామమైన గండుగులపల్లి మాత్రం ఏకగ్రీవం కాకపోవడం గమనార్హం.
