స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5
గంటలకు పూర్తయింది. అప్పటి వరకూ క్యూలో ఉన్న ఓటర్లను ఓటింగ్‌కు అనుమతించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం, వైరా, సత్తుపల్లి, మధిర, కల్లూరు; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, అశ్వారావు పేట మున్సిపాలిటీలు సహా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఖమ్మం
జిల్లాలో 116 వార్డులకు గాను 240 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య అత్యధికంగా నమోదైంది. కాగా, ఉమ్మడి జిల్లాలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాసిందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 11
ఉమ్మడి జిల్లాలో ఓ వైపు పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ.. అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ వివిధ మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారనే; డబ్బు, మద్యం పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కల్లూరులో కాంగ్రెస్ నేతలు.. కొందరు ఓటర్లను ముంబయి నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా రప్పించి అక్కడ నుంచి ప్రత్యేక కార్లలో కల్లూరు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు ఓటు వేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనేక చోట్ల మద్యం బాటిళ్లు, స్వీట్ బాక్సులు, మాంసం ప్యాకెట్లు, 25 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ చేసి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలో 82.50 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,45,875 మంది ఓటర్లు ఉండగా.. 1,16,764 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా కల్లూరులో 86.95 శాతం, అత్యల్పంగా సత్తుపల్లిలో 77.44 శాతం పోలింగ్ నమోదైంది. వైరాలో 83.06 శాతం, ఏదులాపురంలో 85.35 శాతం, మధిర 75.88 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ఏదులాపురం 26వ వార్డు పోలింగ్ బూత్‌లో ఓ కాంగ్రెస్ ఏజెంట్ తమ అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రచారం చేశాడని బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. ఏదులాపురంలోని పోలింగ్ తీరుపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక, అన్ని మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉదయం 10 గంటల తరువాత అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు కూడా ఓటేసేందుకు వచ్చారు. ఏదులాపురంలోని జలగంనగర్ పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. కల్లూరులో పోలింగ్ తీరును ఖమ్మం సీపీ సునీల్‌దత్ పర్యవేక్షించారు. కాగా, పోలింగ్ సరళినిబట్టి పలుచోట్ల బీఆర్ఎస్కు మెజారిటీ వార్డులు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భరోసాతో ఉంది. కాంగ్రెస్ నేతలు కొన్ని మున్సిపాలిటీల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఫలితాలపై మాత్రం పూర్తిస్థాయి భరోసా లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
భద్రాద్రి జిల్లాలో 73.60 శాతం పోలింగ్ నమోదైంది. 106 వార్డులకు గాను 288 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓట్లు వేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్వంచలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాత పాల్వంచలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, రామవరంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం 19, 55 డివిజన్లలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు బుధవారం సందర్శించారు. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించిన ఆయన.. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఇల్లెందు స్ట్రాంగ్ రూముల వద్ద బందోబస్తును పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలింగ్ విజయవంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు.
