– నమస్తే తెలంగాణ కథనాలకు స్పందన
– కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
ఖమ్మం రూరల్, జనవరి 06 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 23వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో ఎట్టకేలకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కాలనీకి పోలింగ్ బూత్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఎన్నికల్లో సగానికి సగం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గత కొద్ది రోజులుగా నమస్తే తెలంగాణ దిన పత్రికలో ఈసారైనా పోలింగ్ బూత్ ఏర్పాటు జరిగేనా అనే కథనం ద్వారా అధికారులు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఎన్నికల అధికారులు కాలనీ వాసులందరినీ ఒకే డివిజన్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఇందిరమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారిగా కాలనీవాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోకుండా తమ కాలనీలోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, రోగగ్రస్త ఓటర్ల దీనస్థితిని తెలియజేసిన నమస్తే తెలంగాణ దినపత్రిక కథనాలను మున్సిపల్, జిల్లాస్థాయి రాజకీయ ప్రతినిధుల సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రస్తావించారు. నమస్తే తెలంగాణ చొరవకు అంతా కృతజ్ఞతలు తెలిపారు.