మణగూరు టౌన్, సెప్టెంబర్ 10 : అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం జరిగిందని, లక్షల కోట్లు కేసీఆర్ కాజేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
మరి అలాంటి ప్రాజెక్టు నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రాజకీయ డ్రామాలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. యాదాద్రి జిల్లాలో గంద మల్లమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, కాళేశ్వరం లేకపోతే గంద మల్లమ్మకు ఎలా నీళ్లు వస్తాయని, హైదరాబాద్ తాగునీటి కోసం గండిపేట వద్ద ఇటీవల రూ.7 వేల కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారని, దానికి కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఇటుక పెడ్డ కూడా పెట్టిన దాఖలాలు లేవని, ఆ డబ్బులతో ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు బీటలు వారిన చోట మరమ్మతులు చేయాలని, లేకపోతే భవిష్యత్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే అని, కేసీఆర్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, హస్తం, కమలం పార్టీలను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులతోపాటు 11 సీట్లలో వందకు వంద శాతం ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. వినాయక చవితి నిమజ్జనంలో కూడా అందరూ కేసీఆర్ పాటే వింటూ సందడి చేశారని, దేవుడు కూడా బీఆర్ఎస్కు అండగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, నూకారపు రమేశ్, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.