ఖమ్మం:పట్టుదల, నిరంతర సాధన చేస్తూ లాంగ్ టెన్నిస్ డబుల్స్‌లో విజయపథంలో ముందుకు వెళ్తున్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు ఆఫీసర్ వెంకటేశ్వరరావులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మంగళవారం అభినందించి సన్మానించారు. ఇటీవల శ్రీ సీతారామ ఆఫీసర్స్ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీసీ ఫీలో సర్వ్ ఇంటర్ స్టేట్ టెన్నిస్ టోర్నమెంట్ 45 సంవత్సరాల కేటగిరి పాల్గొన్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు అధికారి వెంంకటేశ్వరరావు ఓపెన్ టోర్నీలో సత్తాచాటి విజేతలుగా నిలిచారు.
ఇప్పటికే ఖమ్మం, విజయవాడ, హైదరాబాదు, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో జరిగిన ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, లక్ష్యం చేరాలంటే పట్టుదల ఉండాలని, ఓటమి ఎదురైనప్పుడు దానికి కారణాలు అన్వేషించి సరిదిద్దుకోవాలి. దానిని అధిగమిస్తే విజయపథంలో సాగడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ గౌస్ అలం,ఏఆర్ ఏసీపీ విజయబాబు పాల్గొన్నారు.