మామిళ్లగూడెం, అక్టోబర్ 26 : మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల(ఫ్లాగ్ డే) సందర్భంగా నగరంలోని సిటీ ఆర్మ్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రెండు సెకన్లకు ఎవరికో ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటుందని, అది సకాలంలో అందకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందురావాలని ఆయన కోరారు. అమర జవాన్లను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్ల్లాగ్ డే నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు.
శిబిరంలో పోలీసులతోపాటు స్థానిక యువకులు 100 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు, అడిషనల్ డీసీపీ ఏఆర్ కుమారస్వామి, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాసులు, మల్లయ్య, నర్సయ్య, సీఐలు రమేశ్, ఉదయ్ కుమార్, బాలకృష్ణ, మోహన్‌బాబు, ఆర్ఐలు సాంబశివరావు, కామరాజు, శ్రీశైలం, సురేశ్, డాక్టర్ జితేందర్, సంకల్ప తలసేమియా స్వచ్ఛంద సంస్థ, ఆటో యూనియన్ బాధ్యులు పాల్గొన్నారు.