ఖమ్మం, సెప్టెంబర్ 14 : ఖమ్మం నగరంలో సోమవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ఆయా రూట్లలో వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్చాలను ఎంచుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం శనివారం ఆయన మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, వైద్య, విద్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామన్నారు.
సుమారు 700 విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున నిమజ్జన ప్రదేశంలో సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెడతామన్నారు. నిమజ్జనం వద్ద ఒక్కో వాహనం వెంట ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలని ఆదేశించారు. శోభాయాత్రలో సౌండ్ సిస్టమ్, డీజేలు, లేజర్ కిరణాలు వినియోగించడం నిషిద్ధమన్నారు. నిమజ్జనం రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అడిషనల్ డీసీపీలు నరేశ్‌కుమార్, ప్రసాద్‌రావు, విజయబాబులతోపాటు సుమారు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏసీపీలు 7, సీఐలు 18, ఎస్ఐలు 63, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 175, కానిస్టేబుళ్లు 405, హోంగార్డులు 159 మంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.