కారేపల్లి, జనవరి 17 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ దారావత్ హేమలత, ఆమె భర్త, మిషన్ భగీరథ ఏఈ ధరావత్ బాలాజీతోపాటు మరికొంత మంది కలిసి ఆదివాసి గిరిజనులపై అరాచకాలకు పాల్పడుతున్నారని పోలంపల్లి నాగయ్య గుంపునకు చెందిన ఆదివాసి గిరిజనులు శనివారం కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం స్థానిక కొమరం భీమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసి పోరాట హక్కుల సమితి ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్తీ రాంప్రసాద్, తుడుం దెబ్బ జిల్లా నాయకుడు పూనెం శివరాములు మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఆదివాసి గిరిజన బిడ్డ పూనెం హిమబిందు స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందన్నారు.
అయితే ఆదివాసి కోయ కుటుంబానికి చెందిన హిమబిందు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక గెలుపొందిన బంజారా కులానికి చెందిన సర్పంచ్ హేమలత, అతని భర్త బాలాజీతో పాటు ఇంకొంత మంది కలిసి కోయ కులస్తుల మధ్య గొడవలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంకోసారి కోయ కులస్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే చంపుతామని పరోక్షంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అమాయక ఆదివాసీ గిరిజనులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. వారి అరాచకాలకు పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కనీసం విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
ఆదివాసీ గిరిజనులపై కాంగ్రెస్ సర్పంచ్, ఆమె భర్త, అనుచరులు చేస్తున్న అరాచకాలను అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కానునట్టు వెల్లడించారు. ఈ విషయమై ఆదివాసి జిల్లా రాష్ట్ర సంఘం నాయకులతో కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెండెకట్ల యాకయ్య దొర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ జేఏసీ చైర్మన్ తాటి రామారావు, మండలం తుడుం దెబ్బ అధ్యక్షుడు వట్టం నాగేశ్వరరావు, ఆదివాసి జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ ఈసాల రాంబాబు,జిల్లా నాయకులు ఎట్టి సత్యనారాయణ,జబ్బ శివరాం,కోరస సంజీవ్ పాల్గొన్నారు.