– ఈఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితం
– చర్యలు చేపట్టాలంటున్న పర్యావరణ, పశు ప్రేమికులు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 23 : పై ఫొటోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూడడానికి షరా మామూలే అనిపించవచ్చు. కానీ కాస్త లోతుగా మానవీయ కోణంలో ఆలోచన చేస్తే భావితరాల పశు సంపద మనుగడకు ఎంత విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది. ఒకవైపు మున్సిపల్ అధికారులు నిత్యం ప్లాస్టిక్ వాడకం చేపట్టవద్దని తద్వారా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా మూగజీవాల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ అదే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని అనేక వార్డుల్లో ప్రణాళికయుతంగా చెత్త సేకరణ చేపట్టకపోవడంతో కాలనీవాసులు ఖాళీ ప్రదేశాలలో చెత్తను పారబోయడం శరామాములే అయింది. దీంతో దుర్గంధం దుర్వాసనతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలను పరమాన్నంగా భావిస్తున్న మూగజీవాలు నిత్యం వాటిని వేస్తున్నాయి. ఫలితంగా అనారోగ్యాన బారిన పడుతున్నాయి.
క్రమం తప్పకుండా మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ చేపడితే ఇలాంటి పరిస్థితి ఏర్పడబోదని స్థానికులు పేర్కొంటున్నారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ దృశ్యం మున్సిపాలిటీ 23వ వార్డులో చోటుచేసుకుంది. అనేకమార్లు శానిటేషన్ సిబ్బంది ప్రణాళికబద్ధంగా చెత్త సేకరణ చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాలనీవాసులు బయట ప్రాంతాల్లో చెత్తను పారబోస్తున్నారు. అపార్ట్మెంట్లు, ఖరీదైన ఇండ్లకు వద్దకు మాత్రం తెల్లవారుజామునే వచ్చి చెత్త సేకరించే శానిటేషన్ సిబ్బంది నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కాలనీలకు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్లాస్టిక్ వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకుండా, పశువులు ప్రమాద బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.