లక్ష్మీదేవిపల్లి, జూన్ 25: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని బెటాలియన్స్ డీఐజీ సన్నీ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని చాతకొండ 6వ బెటాలియన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. తొలుత బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీనివాసరావు, అబ్దుల్ రషీద్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.