ముదిగొండ, జనవరి 25 : నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అధికారులకు ప్రహసనంగా మారగా.. ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు ఎంపిక కూడా తలనొప్పిగా మారింది. మండలంలోని ఏదైనా ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. జనవరి 26వ తేదీ నుంచి ఆయా పథకాలు ఆ గ్రామంలోనే అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అధికారులు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపికకు శనివారం రాత్రి 7 గంటల నుంచి సర్వే చేపట్టారు. జాబితా ప్రకారం ఇల్లిల్లూ తిరిగి మీకు ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలు వస్తాయని చెప్పగా ప్రజలు సంబురపడ్డారు.
రెండు గంటలపాటు సర్వే తర్వాత మరో గ్రామం ఎంపిక చేశాం.. వెంటనే అక్కడికి వెళ్లి సర్వే మొదలుపెట్టాలని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. దీంతో ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇప్పటివరకూ మా ఊల్లో సర్వే చేసి.. అన్ని పథకాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు మరో ఊరు అంటారా? అని సదరు అధికారులతో వాగ్వానికి దిగారు. ‘మాకు ఆదేశాలు వచ్చాయి. మేము ఏమీ చేయలేం’ అని చెప్పడంతో.. మా గ్రామాన్ని ఎంపిక చేయకుండా బయటకు ఎలా వెళతారో చూస్తాం అంటూ ఆగ్రహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘మాకు పథకాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లనివ్వం’ అంటూ గ్రామస్తులు బైఠాయించారు. మేము చేసేది ఏమీ లేదని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. చేసేది లేక అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం గంట సేపటి తర్వాత మార్పు ఏమీ లేదని, మీ గ్రామాన్నే ఎంపిక చేయాలని ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో గ్రామస్తులు శాంతించారు. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం కావడంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి హైడ్రామా నడుమ నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసింది.