ఖమ్మం రూరల్, జనవరి 27: ఇందిరమ్మ ఇంటి కోసం ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అర్హుల జాబితాను వెల్లడించింది. ఆ జాబితా ఆసాంతం అనర్హుల పేర్లే ఉండడం, అర్హులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
చివరికి నామమాత్రంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే, అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడం, అన్నీ అనర్హుల పేర్లే ఉండడంతో అసలైన పేదలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఈ నెల 23న జరిగిన గ్రామసభలో తన కుమారుడు రాము పేరు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా లేదని అతడి తండ్రి చాట్ల కృష్ణయ్య (62) తెలుసుకున్నారు.
పేద కుటుంబం అయినప్పటికీ ప్రభుత్వం తన కుమారుడిని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక చేయకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి అదే బాధతో మదనపడుతూ ఉంటున్న కృష్ణయ్య.. ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సీపీఎం నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు తదితరులు వచ్చి కృష్ణయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన కృష్ణయ్య కుమారుడికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమని అన్నారు.