ఖమ్మం రూరల్, అక్టోబర్ 8: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన చివరకు ప్రజల ఆశీర్వాదంతో పాలేరులో గులాబీజెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్నికొనే సత్తా ఎవరికీ లేదని స్పష్టం తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బానోత్ చంద్రావతి, కుమార్తె దీపికారెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వరికి నామినేషన్ పత్రం అందజేశారు. తొలుత ఎమ్మెల్యే కందాళ ఖమ్మం రూరల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దల ఆశీర్వారాలు, కుటుంబం సభ్యులు, పార్టీ నాయకుల అభినందనలు అందుకున్న అనంతరం నేరుగా రెడ్డిపల్లిలోని మారెమ్మతల్లి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తరువాత అక్కడి నుంచి ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. బయటకు వచ్చాక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసిన ఘనత కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని, ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందని అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, ఇంటూరి శేఖర్, గూడ సంజీవరెడ్డి, బానోత్ శ్రీనివాస్, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న తదితరులు పాల్గొన్నారు.