ఖమ్మం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని, ఎన్నికల్లో గెలిచిని సత్తుపల్లి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే’తో ముచ్చటించి పలు విషయాలను వెల్లడించారు. నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించానని, ప్రజలు నాలుగోసారీ తనకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని స్పష్టం చేశారు. కాగితాలకే పరిమితమయ్యే వాగ్దానాలు తానెప్పుడూ చేయలేదని, తాను ప్రజలకు మంచి అనుకున్నా ప్రతి పనిని చేసి చూపించానన్నారు. ప్రజల హృదయాల్లో తనకు సుస్థిర స్థానం ఉందన్నారు. ప్రజలే తనను ఎన్నికల్లో గెలిపించుకుని, గుండెల్లో పెట్టుకుంటారన్నారు.
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వాసుపత్రులను 50 పడకల ఆసుపత్రిగా మార్చామని సండ్ర తెలిపారు. ఒకప్పుడు జిల్లా కేంద్రాలకు పరిమితమైన నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలను నియోజకవర్గానికీ తీసుకొచ్చానన్నారు. కేఎం బంజర నుంచి ఎల్ఎస్ బంజర వరకు ప్రధాన రహదారి నిర్మించామన్నారు. తాను ఏనూడూ శాసనసభ్యుడిగా హంగూ ఆర్భాటాలు చేయలేదని, ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారన్నారు. సమస్యల్లో ఉన్న వారు నేరుగా తనను కలుస్తారన్నారు. తానూ ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటానన్నారు.
ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా, ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపిస్తారని, సత్తుపల్లిలో తన విజయం ఖాయమని సండ్ర ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి సత్తుపల్లికి ఐటీ హబ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సత్తుపల్లి జిల్లాకేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అలాగే కల్లూరును మున్సిపాలిటీగా మారుస్తామన్నారు. తాను 15 ఏళ్లు ఎమ్మెల్యేగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి కొనసాగింపు ఉంటుందని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.