మామిళ్లగూడెం, జనవరి 9: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో పోలీసు పహారా మరింతగా పెంచుతున్నట్లు ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రజలు కూడా పోలీసులకు సహకారించాలని కోరారు. ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లడం గానీ, లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం గానీ చేయాలని సూచించారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలూ చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్, బీట్ గస్తీ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
తాము చేసే కొన్ని ముఖ్యమైన సూచనలను ప్రజలు విధిగా పాటించాలని కోరారు. ఇంటికి తాళం వేసిన తరువాత అది బయటకు కనిపించకుండా గుమ్మానికి పరదా కప్పి ఉంచాలన్నారు. మెయిన్ డోర్‌ను లోపలి నుంచి లాక్ చేసి పక్క డోర్లకు కూడా తాళాలు వేయాలని సూచించారు. బీరువాల తాళాలు ఇంట్లో కప్ బోర్డుల్లో గానీ లేదా ఇతర ప్రదేశాల్లో గానీ ఉంచకూడదని సూచించారు. ఊరు వెళ్తున్న విషయాన్ని నమ్మకస్తులైన పొరుగిళ్ల వారికి, సంబంధిత పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఆయా ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
అలాగే, అనుమానిత వ్యకులు లేదా కొత్త వ్యక్తులు ఆయా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. మొబైల్ ఫోన్‌కు నోటిఫికేషన్ వచ్చేలా ఇంటికి సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను కూడా ఫోన్లో సేవ్ చేసుకోవాలన్నారు. సమాచారం కావాలంటూ ఇంట్లోని మహిళలు, వృద్ధుల వద్దకు వచ్చే అపరిచితులను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి సూచనలు పాటిస్తూ ప్రజలకు సహకరించాలని కోరారు.