కారేపల్లి, జూలై 15 : వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) బి.కళావతి బాయ్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ యూనిట్‌ను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం సీతారాంపురం గ్రామంలో గల ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రజలను కలిసి సబ్ సెంటర్ ద్వారా వైద్య సిబ్బంది అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు కాచి వడపోసి తాగాలని, బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా వేడి ఆహార పదార్థాలు భుజించాలన్నారు. జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలన్నారు. భోజనానికి ముందు చేతులు కడుక్కుని పరిశుభ్రత పాటించాలని సూచించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మురుగునీరు మళ్లించే చర్యలు చేపట్టి పరిశుభ్రతపై దష్టి సారిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. డెంగీ వ్యాధికి కారకాలైన దోమలు వ్యాపించకుండా పాత వాటర్ బాటిల్స్, టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత్రలో నీరు నిల్వ ఉండకుండా తొలగించాలన్నారు. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం వైద్య సిబ్బందిచే ప్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ వివిధ రకాల వ్యాధుల నివారణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా దగ్గరలో ఉన్న ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి సమాచారం ఇచ్చి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి బి.సురేశ్, హెల్త్ సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
Karepalli : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎంహెచ్ఓ కళావతి భాయ్