మధిర, సెప్టెంబర్ 16 : నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయా దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్దం కావాలని సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధిర పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వాసిరెడ్డి వెంకటపతి స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఊట్ల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్వాతంత్ర్య భారత చరిత్రలో అపూర్వమైన అధ్యాయం అన్నారు. జమీందారీ వ్యవస్థ కూల్చివేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన పోరాటయోధుల త్యాగాలు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో వేలాది మంది రైతులు, కూలీలు, గిరిజనులు చేతిలో తుపాకీ, కొడవల్లు విల్లు, బాణాలు పట్టుకుని జమీందారుల దోపిడీని ఎదిరించారని గుర్తుచేశారు.
ఈ పోరాటం వల్లే వేలాది ఎకరాల భూమి పేదలకు పంచబడిందని, పల్లెల్లో గణనీయమైన సామాజిక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. రాచరికానికి, నిర్భందానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బీజీపీ, ఎంఐఎం పరస్పరం పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, కమ్యూనిస్టులు చేపట్టిన వీరోచిత పోరాటాలను తట్టుకోలేకనే నైజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సుదినం సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. సాయుధ పోరాట అమరులు ఆశించిన లక్ష్యాల సాధన దిశగా పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, ఏనుగు గాంధీ, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎంఏ రహీం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్ళపల్లి ప్రకాష్ రావు, మంగళగిరి రామాంజనం, పంగా శేషగిరిరావు, కొండూరు నాగేశ్వరావు, జల్లా బ్రహ్మం, పరుచూరి రాము, అన్నవరపు సత్యనారాయణ, ఊట్ల రామకృష్ణ పాల్గొన్నారు.