ఇల్లెందు, ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ పాలనలో కర్షకులందరినీ వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగా వ్యవసాయ సంబంధ సమస్యలు ఒకదాని వెంట మరొకటి వస్తూ రైతులను చుట్టుముడుతున్నాయి. దీంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. అన్నదాతలకు తాము భరోసానిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ కర్షకులను కడగండ్లలోకి నెట్టేసింది. రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ నెరవేర్చిన పాపానపోలేదు. పైగా, పంటల సాగుకు ఆటంకం లేకుండా ఠంచనుగా అందించాల్సిన వాటికి కూడా ఎగనామం పెడుతోంది. ఫలితంగా.. రైతుభరోసా పంటల పెట్టుబడి సాయం దగ్గర నుంచి మొదలుకొని విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరలు, బోనస్ డబ్బులు, పంటలు విక్రయించిన పైకాల వంటి ఇత్యాదులు సకాలంలో అందించకపోవడంతో కర్షకులందరూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు.
తాజాగా ఇల్లెందు మండలంలోని మొక్కజొన్న రైతులకు విద్యుత్ లో వోల్టేజీ సమస్య చుక్కలు చూపిస్తోంది. 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామంటూ అందలమెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు అన్నదాతలు కష్టాల్లో ఉన్న వేళ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పంటల సాగు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతులు.. ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్నారు. మొన్నటిదాకా యూరియా దొరకక ముప్పుతిప్పలు పడిన రైతులు ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వ పాలనలో రైతుల వ్యవసాయానికి భరోసా లేకుండాపోయింది. తాజాగా ఇల్లెందు మండలంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నాయి. మొన్న వానకాలం సీజన్లో సకాలంలో యూరియా అందించని కారణంగా ముప్పుతిప్పలు పడిన రైతులు.. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించి పంటలను కాపాడిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పెడుతున్న కష్టాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు మండలంలోని రైతులు మొక్కజొన్న పంటను కూడా అధికంగా సాగు చేస్తుంటారు. ఏటా వానకాలంలో అయితే సుమారు 35 వేల ఎకరాల్లోనూ, యాసంగిలో అయితే సుమారు 21 వేల ఎకరాల్లోనూ మక్కను సాగు చేస్తుంటారు. గడిచిన వానకాలం సకాలంలో యూరియా అందని కారణంగా మక్క రైతులు చాలామంది భారీగా దిగుబడిని కోల్పోయారు. ఇప్పుడు యాసంగిలోనైనా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుందామనుకున్న రైతులకు విద్యుత్ లో వోల్టేజీ సమస్య చుక్కలు చూపిస్తోంది. అయినా ప్రభుత్వం కనీసమాత్రంగానూ స్పందించకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లో వోల్టేజీ సమస్యతో విద్యుత్ మోటర్లు నడవడం లేదు. దీంతో పంటకు నీళ్లు కట్టేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇల్లెందు మండలంలోని కొమరారం, పోలారం, శెట్టిపల్లి, మాణిక్యారం, బోయితండా గ్రామాల్లో అనేక మంది రైతులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ మోటర్లు నడవక తమ పంటలు ఎండిపోతున్నాయంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉంటే ఇక రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూగర్భ జలాలు మరింత అడుగంటితే ఇక తమ పంటలు చేతికిరావంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లెందు మండలంలోని వ్యవసాయ భూముల్లో అధిక శాతం మొక్కజొన్న పంట సాగుకే అనుకూలమైనది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకెల్లా ఈ మండలం నుంచే ఏటా అధిక విస్తీర్ణం మొక్కజొన్న సాగవుతుంది. ఈ యాసంగిలోనూ మండల రైతులు 21 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే, ఇటీవలి వానకాలంలోనూ 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియా అందించని కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. యాసంగిలోనైనా ఆ నష్టాన్ని పూడ్చుకుందామనుకున్న రైతులను ఇప్పుడు విద్యుత్ లో వోల్టేజీ సమస్య వేధిస్తోంది.
నాకు 7 ఎకరాల పొలముంది. అందులోని 5 ఎకరాల్లో మొక్కజొన్న, 2 ఎకరాలు వరి సాగు చేస్తున్నా. యాసంగి కాబట్టి బోరుమీదనే ఆధారపడుతున్నా. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు 24 గంటలూ విద్యుత్ సరఫరా కావడం లేదు. లో వోల్టేజీ సమస్య వల్ల మోటర్లు సరిగా నడవడం లేదు. ఎకరం పొలాన్ని తడపడానికి రెండు రోజులు పడుతోంది.
-మూడ్ లింగా, రైతు, కొమరారం, ఇల్లెందు
నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న, వరి సాగు చేశాను. లో వోల్టేజీ కారణంగా మొక్కజొన్నకు నీరు అందించడంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. సాగునీరు సరిగా అందక మొక్కజొన్న, వరి పంటలు నెర్రెలు వారుతున్నాయి. ఈ లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి శెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వం విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.
-వాంకుడోత్ మోతీలాల్, రైతు, కొమరారం, ఇల్లెందు