మార్కెట్, మనీ మేటర్స్ మగవాళ్ల మాటలనుకునే రోజులకు కాలం చెల్లింది. స్టార్టప్‌లు, స్టాండప్ కామెడీల్లోనూ అమ్మాయిల హవా నడుస్తున్నది. ఇప్పటి దాకా సంపన్న కుటుంబాల అమ్మాయిలు సాధించిన విజయాలే చదివారు. ఇకముందు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిల విజయాల గురించీ చదువుతారు. అందుకు పూర్వ రంగం తెలంగాణ కళాశాలల్లో సిద్ధమవుతున్నది. ‘లాంచ్ గర్ల్స్’ శిక్షణలో గర్ల్ బాస్‌లు రెడీ అవుతున్నారు. అబ్బాయిలూ.. ‘ఎస్ బాస్’ అనేందుకు మీరూ సిద్ధంగా ఉండండి.
అందరు ఆడపిల్లల్లాగే ప్రణవి ఇంటిపట్టున పెరిగింది. వాళ్ల నాన్న ఆదిలాబాద్‌లో చిన్న వ్యాపారి. బడికి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప పెద్దగా బయటికి వెళ్లేది కాదు ప్రణవి. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడేది. ఇంటర్ తర్వాత బీసీఏ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరింది. ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఒంటరిగా ఉండటం అలవాటైంది. హాస్టల్ రూమ్‌లో కూడా ఒక్కదాన్నే కాలక్షేపం చేసేదాన్ని. క్లాస్‌రూమ్‌లో కూడా కామ్‌గా ఉండేదాన్ని’ అని గతాన్ని గలగలా చెప్పుకుంటూ పోయింది ప్రణవి. బెల్లం కొట్టిన రాయిలా ఉండే ప్రణవి మైక్‌లా మారిందేమిటనే సందేహం రావొచ్చు. ప్రణవి ఒక్కతే కాదు.. ఆమె దోస్తులు కూడా కాలేజీకి వచ్చాక కొద్ది నెలల్లోనే మారిపోయారు.
‘అందరూ చదవాలి’ అనే సర్వశిక్షా అభియాన్ మిషన్ ఆశించినట్టే బడుల్లో అందరూ చేరుతున్నారు. బడి చదువులు కాగానే కాలేజీలో అడుగుపెడుతున్నారు. పాఠాలు, పరీక్షలు పూర్తి చేసి పట్టాలతో ఇళ్లకు వెళ్తున్నారు. కానీ, ఆ మిషన్ ఇంకో లక్ష్యమైన ‘అందరూ ఎదగాలి’ అన్నది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. వయసులో పెరగడం తప్ప.. వ్యక్తిత్వంలో ఆశించిన ఎదుగుదల కనిపించడం లేదు. నైపుణ్యాలు నేర్పని పట్టాల చదువుతో రేపు ఉద్యోగం రాదు. వ్యాపారంలో రాణించలేరు. కెరీర్‌ని నిర్మించుకోలేరు. ఇలాగైతే.. మహిళా సాధికారత ఎలా సాధ్యం? కాబట్టి మహిళా సాధికారతకు, అవరోధాలకు మధ్య ఓ వారధిలా ‘కాలేజ్ టు కెరీర్’ నిర్మిస్తున్నది ‘లాంచ్ గర్ల్స్’ అనే స్వచ్చంద సంస్థ. ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్‌తో కలిసి ఈ సంస్థ క్యాంపస్‌లోనే మహిళా సాధికారత కోసం ‘గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ’ అనే కోర్స్‌ని నిర్వహిస్తున్నది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, కంప్యూటర్స్ చదువుతున్న 360 మంది అమ్మాయిలు ఇందులో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడే ప్రణవి ప్రేరణ పొందింది. అంతకుముందు స్ఫూర్తిమంతమైన మహిళల జీవితాల్లోని ఆటుపోట్లను విని, చదివి స్ఫూర్తి పొందింది. ఆ స్ఫూర్తితోనే తన జీవితంలోని ఆటంకాన్ని గుర్తించింది. ‘గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ’ శిక్షణా తరగతుల్లో నలుగురి మధ్య తడబడుతూనే మాట్లాడటం మొదలుపెట్టింది. ‘ఏమాటంటే ఏమనుకుంటారోనని భయంతో ఉండే నేను మాట్లాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు నా ఆలోచనలను అందరి ముందూ ధైర్యంగా పంచుకోగలుగుతున్నా’ అని ప్రణవి నవ్వుతూ చెప్పింది. ఈ డిగ్రీ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిల్లో 360 మంది ప్రణవిలాగే ఏ జంకూ లేకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అదంతా ‘గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ’ శిక్షణ మహిమ!
‘మాటలు క్యాంపస్ దాటితే కెరీర్ బిల్డప్ కాదు. మాటలతోపాటే ఇంకెన్నో నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. కొత్త కలలు కనాలి. ఆ కలలు పండించుకునేందుకు కష్టపడాలి. ఇది సాధ్యమేనా? ‘నలుగురు కలిస్తే మెకప్, డ్రెస్‌లు, ఆభరణాల గురించి మాట్లాడుకునే అమ్మాయిలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా సైన్స్, స్టార్టప్, ఆంత్రప్రెన్యూర్షిప్ల గురించి ఆలోచించేలా చేయడం పెద్ద టాస్కే. వాళ్ల మెదళ్లలో బలవంతంగా కోరికల్ని కృత్రిమంగా ఇన్స్టాల్ చేయకుండా, వాళ్లకు ఏది ఇష్టమో గుర్తించి, వాళ్లకు అవసరమైన దారి చూపుతున్నామ’ని ‘గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ’ కోసం పనిచేస్తున్న మెంటార్లలో ఒకరైన డాక్టర్ జి.రాధిక అన్నారు. ‘ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగానే ఆలోచిస్తారు. కానీ, సామాజిక వెనుకబాటుతనం, కుటుంబాల్లో ఉండే నియంత్రణ వల్ల ఆడపిల్లల ఆలోచన కొన్ని విషయాలకే పరిమితమైపోయింది. సామాజిక అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తే వీరి ఆలోచనలూ విస్తృతమవుతాయి. అందుకని ఇది చేయాలి, అది చేయాలని చెప్పకుండా కష్టపడి ఎదిగిన మహిళల గురించి మొదటి పాఠాల్లో చెబుతున్నాం. పర్వతారోహకురాలు అరుణిమా సిన్హా, సుప్రిం కోర్టు ప్రముఖ న్యాయవాది మీనాక్షీ అరోరా, స్విమ్మర్ భక్తి శర్మ, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ఇలా మహిళల విజయగాథలు చదివిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ల జీవితాలను పోలినవాళ్లు మనచుట్టూ ఎలా ఉన్నారు? వాళ్లు ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు? తమకే ఆ సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో? విద్యార్థినులు చర్చించుకునే అవకాశం కల్పిస్తున్నాం’ అని వారి ప్రయత్నాన్ని వివరించారు రాధిక. ఈ చర్చల్లో ఆడపిల్లలకు మాటకారితనమే కాదు సవాళ్లను ఎదుర్కొనే సాహసమూ అలవడుతుంది. అలా ‘నేను ఇది చేయగలను’ అనే ైస్థెర్యాన్ని మనసులో నాటుతున్నారు. రేపటి విజయానికి ఈ ైస్థెర్యమే పునాది కావాలని నిర్వాహకుల ఆశ. ఆడబిడ్డల ఆశయం.

ఇంట్లో పెద్దవాళ్లనుకున్నట్టు బుద్ధిగా చదువుకోవాలని వచ్చిన అమ్మాయిలు కాలేజీలో మెంటర్స్ చెప్పే గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ క్లాస్‌లు విని కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటున్నారు. రిస్క్ అయినా ఫర్వాలేదని ధైర్యంగానే అంటున్నారు. ఈ ధైర్యం ఎలా వచ్చిందంటే? ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక వాలెట్ తయారు చేశారట. దాని తయారీ గురించి మాటలు మొదలుపెట్టినప్పుడు దేనితో తయారు చేయాలని ఆలోచిస్తే.. వాలెట్ తయారీకి ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయో వాళ్లకు తెలిసొచ్చిందట. వాలెట్ రంగులు, హంగులు గురించి ఆరా తీస్తే మార్కెట్లో అదో సైన్స్ అంత విస్తృతంగా ఉందట. అమ్మాయిలకు సేఫ్టీ ముఖ్యం. కాబట్టి పెప్పర్ స్ప్రే పెట్టడానికి ఒక అర, జీపీఎస్ ట్రాకర్, సేప్టీ అలారం ఇలా రకరకాల ఆలోచనలు చేశారు. పని మొదలుపెట్టాలే కానీ, అమ్మాయిల ఇన్నోవేటివ్‌గా చేయగలరని నిరూపించుకున్నారు. అంతేనా.. ఇంకా ఉన్నాయనంటూ.. ‘వాలెట్‌ని అమ్మేవాళ్లు ఎన్ని మాటలు చెబుతారో. ఎలా ఒప్పిస్తారో తెలుసుకున్నాం’ అని మార్కెటింగ్ స్కిల్స్ గురించి బీసీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విని చెప్పింది.
కాలేజీకి వచ్చిన అమ్మాయిలు ఆ తర్వాత ఉన్నత విద్యకు వెళ్లాలి. మంచి ఉద్యోగాలు చేయాలి. ఉపాధికి దారులైనా వేసుకోవాలి. ఆంత్రప్రెన్యూర్‌గా మారాలి. ఏదో ఒకటి జరిగితేనే మహిళా సాధికారత సాధ్యం. దానిని సుసాధ్యం చేసేందుకు విద్యతో ఉపాధికి దారులేస్తున్నామని లాంచ్ గర్ల్స్ కో ఆర్డినేటర్ సిద్రా చెబుతున్నారు. జ్ఞాన సముపార్జనతోపాటు వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగం, ఉపాధి, సామాజిక ప్రయోజనం చదువు లక్ష్యాలు. ఈ లక్ష్యాలకు చేరుకోకుండా కుటుంబ నేపథ్యం, సామాజిక వెనుకబాటుతనం, పేదరికం ఆటంకంగా ఉన్నాయని, ఈ సమస్య ఆడపిల్లల్లో ఎక్కువగా ఉందని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇన్చార్జ్ కొడాలి సుచిత అంటున్నారు. ఇలా వెనుకబాటులో ఉన్నవాళ్లు ముందడుగు వేసేందుకే లాంచ్ గర్ల్స్ చేపట్టిన ప్రయత్నం తెలంగాణలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఉన్న కళాశాలల్లో కొనసాగుతున్నది. మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సవాళ్లను ఎదుర్కోవడమే కాదు ఆలోచనలకు ఆచరణ రూపమివ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నోవేషన్లు సాధారణ కళాశాలల్లోనూ సాధ్యమేనని తెలంగాణ ఆడబిడ్డలు నిరూపిస్తున్నారు.
కాలేజీలో ‘గర్ల్ బాస్ ఫ్యూచర్ రెడీ’ శిక్షణతో తులసి ఆలోచనలే మారిపోయాయి. కాలేజీకి వచ్చిన కొత్తలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకునేదట. తన ఆలోచనలే కాదు ఆశయాలు మారిపోయాయి. పెద్దయ్యాక ఒక బిజినెస్ చేయాలనే కోరిక పెట్టుకుంది. పేద కుటుంబంలో పుట్టిన తనకు ఆ కోరిక కష్టమైనదే. ‘ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి, పెట్టుబడికి కావాల్సినంత కూడబెడతాను. ఆ తర్వాతైనా బిజినెస్ చేస్తాను’ అని ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంది.