మధిర, ఆగస్టు 13 : తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ మధు అన్నారు. బుధవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 48 గంటలు, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మధిర, ఎరుపాలెం, బోనకల్లు మండలాల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలతో వచ్చే వరద నీటి ద్వారా కట్టలేరు, మధిర, వైరా నదులతో పాటు చెరువులకు వరద నీరు పోటెత్తే అవకాశం ఉందన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు, పశువులను ఏరులలోకి, చెరువుల్లోకి తీసుకువెళ్లొద్దన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయాలని, రాత్రి వేళల్లో వర్ష ప్రభావంతో వచ్చే వరద ఉధృతిని అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని మధిర రూరల్, బోనకల్లు, ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.