బోనకల్లు, ఆగస్టు 28 : భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోనకల్లు తాసీల్దార్ మద్దెల రమాదేవి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా మరో నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు కురువనున్నట్లు తెలిపారు. వాతావరణం శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. మండల ప్రజలు ఆయా గ్రామాల్లో వర్షాల కారణంగా ఎవరూ బయటకు వెళ్లవద్దన్నారు. వ్యవసాయ పనులు, చేపలు పట్టడం, పశువులు, గొర్రెలను మేపేందుకు తీసుకుని పోవద్దని సూచించారు. అలాగే పాత ఇండ్లలో, కూలిపోయే ఇండ్లలో ఉంటే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.