కారేపల్లి,ఫిబ్రవరి 7:-ఏడాది పాటు సాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు అన్నారు. కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లిన ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత స్పందన ప్రత్యక్షంగా కండ్ల ముందు కనిపిస్తుందన్నారు.ప్రతి ఒక్కరూ మళ్లీ మాజీ సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందన్న విషయాన్ని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కళ్ళ ముందు ఉంచారన్నారు.మాయ మాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికే దివాలా తీసిందన్నారు.
ప్రభుత్వ పథకాల పేరుతో గ్రామాలలో హడావుడి తప్ప అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కాంగ్రెస్ పాలనపై అసమ్మతి వ్యక్తం చేయడం అందుకు నిదర్శనమన్నారు.అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు స్వయంగా మాకు లెక్కలు అర్థం కాక గతంలో చేసిన అప్పులు చూసుకోకుండా ఎడాపెడా 420 హామీలు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నామని ఒప్పుకోవడం జరిగిందన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే ప్రభుత్వ పనితీరును ఎండబెట్టడం రేవంత్ సర్కార్ పాలనకు సిగ్గు చేటన్నారు.మరోపక్క రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి అడ్డంగా దోచుకుంటున్నడని జడ్చర్ల ఎమ్మెల్యే బహిరంగంగా దూషిస్తుంటే ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ బడులలో చదవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపించలేదని కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విద్యా సంస్థలకు మహార్దశను తీసుకువచ్చారన్నారు. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలిందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ పై బురద చల్లిన కాంగ్రెస్ వాళ్లే కాలేశ్వరం నీళ్లను హైదరాబాదుకు తీసుకువచ్చి ఉపయోగిస్తున్నారన్నారు.హైడ్రో పేరుతో పలుకుబడి కలిగిన వ్యక్తుల ఫామ్ హౌస్ లను పక్కనపెట్టి, పేదల ఇండ్లను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే హైడ్రాను తెరమీదకు తీసుకురావడం జరిగిందన్నారు.ఉద్యోగ విరమణ పొందిన వారికి చందాల్సినవి ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రజా తీర్పుతో ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు బెదిరింపులకు పాల్పడుతుందన్నారు.ప్రభుత్వ పనితీరును ఎండగట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పార్టీని నమ్ముకుని ఉన్నవారికి నాయకత్వం సముచిత స్థానం కల్పిస్తుందని భరోసానిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్,మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్,జిల్లా యూత్ నాయకులు ముత్యాల వెంకట అప్పారావు,అడప పుల్లారావు,మాజీ సర్పంచ్ బాణోత్ కుమార్,శివరాత్రి అచ్చయ్య,బత్తుల శ్రీనివాసరావు,బానోతు రాందాస్,ఇస్లావత్ బన్సీలాల్, సిద్ధంశెట్టి నాగయ్య,జాలా సాంబ,షేక్ ఖాజావలి,యాకుబ్ పాషా,షేక్ సలీం గూగులోత్ భాస్కర్,బాబులాల్,సూక్య తదితరులు పాల్గొన్నారు.