కొత్త రేషన్‌కార్డుల కోసం పేదలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన సభల్లో నెట్టుకుంటూ వెళ్లి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. కార్డులు వస్తాయని నమ్మారు.. కానీ రాలేదు. మళ్లీ ఇంటింటి సర్వేకు వచ్చి కుటుంబ సభ్యులందరి వివరాలు చెప్పమన్నారు.. చెప్పారు. ఇక కొత్తకార్డులు వచ్చినట్లే అనుకున్నారు. లేదు మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అక్కడికీ పరుగులు పెట్టారు.
అయితే పాతకార్డులో పేర్లు తొలగించుకుంటేనే దరఖాస్తు చేసేందుకు వీలవుతుందని నిర్వాహకులు చెప్పడంతో.. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు ఒక్క పరుగు తీశారు.. పేర్లు తొలగించుకున్నారు. అత్తగారి ఇండ్లకు వెళ్లి వారి రేషన్‌కార్డులో భార్యల పేర్లను కూడా అక్కడి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తొలగించుకున్నారు. తర్వాత మీ సేవ కేంద్రాలకు వెళ్లి తమ పిల్లల పేర్లతో సహ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉరుకుల పరుగులు పదిహేను నెలలుగా జరుగుతున్న తంతు.
కానీ కొత్త రేషన్‌కార్డుల జాడ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఎప్పుడొస్తాయో కూడా తెలియకుండా కొత్తకార్డుల కోసం నిరుపేదలు వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వకుండా పేదలను చాలా ఇబ్బంది పెడుతున్నదని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తమ పేదరికాన్ని అలుసుగా తీసుకోకుండా ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
– ఖమ్మం, మార్చి 23
ఖమ్మం నగరంలోని 25వ డివిజన్‌కు చెందిన ఆర్.సీతరాములుకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులకు 8 ఏండ్ల క్రితం వివాహాలు జరిగాయి. వారిద్దరికి ఇద్దరేసి చొప్పున పిల్లలు ఉన్నారు. రోజువారి పనులకు వెళ్లే కుటుంబం వారిది. ఐతే చాలా సంవత్సరాల నుంచి వారి రేషన్‌కార్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఐదునెలల క్రితం మీ సేవా కేంద్రానికి వెళ్తే మీరు ఉన్న రేషన్‌కార్డులో మీ పేర్లు తొలగించుకుంటే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని చెప్పడంతో వారిరువురు అన్నదమ్ములు ఐదునెలల క్రితం ఖమ్మంఅర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి పేర్లు డిలిట్ చేయించుకున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి తిరిగి మీ సేవకు వెళ్తే మీ ఒక్కరేదే కాదు మీ భార్యల పేర్లు కూడా ఇదే మాదిరిగా మీ అత్త గారి కార్డు నుంచి తొలిగించుకోవాలని చెప్పారు. దీంతో హుటాహుటిన వారి అత్తగారి ఊైర్లెన వరంగల్ జిల్లాకు ఒకరు, నల్గొండ జిల్లాకు మరొకరు వెళ్లి అక్కడ తహసీల్దార్ కార్యాలయాల్లో వారి భార్యల పేర్లను రేషన్‌కార్డుల నుంచి డిలిట్ చేయించుకొని వచ్చారు. ఖమ్మంలోని మీ సేవలో వారి భార్యలు, పిల్లల ఆధార్‌కార్డులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేసి దరఖాస్తు చేశారు.. ఇది జరిగి సుమారు ఐదునెలలు అవుతున్నది.. కానీ ఇంతవరకు కొత్త రేషన్‌కార్డు రాలేదు.
అప్పటివరకు వారికి 30కిలోల బియ్యం ప్రతి నెలా వచ్చేవి. అవి కాస్త 18 కిలోలకు తగ్గాయి. ఇదే మాదిరిగా వారి అత్తగారి కార్డులో కూడా ఆరు కిలోల చొప్పున బియ్యం తగ్గాయి. కాని ఇంతవరకు కొత్త కార్డు రాలేదు. కనీసం ఏ అధికారి కూడా విచారణకు వచ్చింది లేదు. కార్డు వస్తుందో, రాదో కూడా తెలియదు. కొత్తకార్డు ఏమో కానీ ఉన్న బియ్యం పోయాయని బాధ పడుతున్నారు.
బోనకల్‌కు చెందిన రమేశ్‌కు 11ఏండ్ల క్రితం వివాహం జరిగింది. కూతురు, కుమారుడు ఉన్నారు. రేషన్‌కార్డులో రమేశ్, అతడి భార్య పద్మ మాత్రమే ఉన్నారు. వారి పిల్లలకు 10 ఏండ్లు ఒకరికి, 8 ఏండ్లు ఒకరికి వచ్చాయి. వారి రేషన్‌కార్డులో పిల్లల పేర్లు చేర్చడానికి 10 నెలల క్రితం మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేశారు. అప్పుడు మీ సేవ నిర్వాహకులు స్లిప్ ఇచ్చారు.. అయితే ఇంతవరకూ పిల్లల పేర్లు కార్డులో యాడ్ కాకపోవడంతో మీ సేవకు వెళ్లి మరోసారి దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు.
కాగా ఇంతకముందే మీరు దరఖాస్తు చేశారు.. ఆ స్లిప్ తెస్తే మీ స్టేటస్ చెబుతామని మీ సేవ అతను చెప్పడంతో ఇంటికి వెళ్లి ఎంత వెదికినా ఆ స్లిప్ దొరకలేదు.. తిరిగి దరఖాస్తు చేయడానికీ వీలుకావడం లేదు.. ఏమిచేయలేక ఆందోళన చెందుతున్నారు. ఇది ఒక్క సీతరాములు, రమేశ్ బాధలు మాత్రమే కాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని వేల మంది నిరుపేదలు పడుతున్న బాధలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నది. అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ ఇంతవరకు ఒక్క కొత్తకార్డు కూడా ఇవ్వలేదు. కనీసం పిల్లల పేర్లు సైతం చేర్చడం లేదు. కొత్త కార్డుల కోసం, పిల్లల పేర్లు యాడ్ చేయడం కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు.. వారందరి పరిస్థితి ఇదే. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన రెట్టింపు అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో రేషన్‌కార్డులోని పేరు తొలగింపునకు మాత్రం తహసీల్దార్ కార్యాలయాల్లో ఆప్షన్ ఉంది. కానీ యాడింగ్ మాత్రం కార్యాలయ సిబ్బందికి ఇవ్వలేదు.. కనీసం కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తహసీల్దార్ వద్ద లేవు. విచారణ చేయడానికి ఏ స్థాయిలో ఉందో కూడా తెలియట్లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొత్త కార్డులు రాక, పిల్లల పేర్లు యాడ్ కాక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ జనం తిరుగుతున్నారు. రేషన్‌కార్డు నుంచి తమ పేరును డిలీట్ చేయమని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చిన గంటలోనే కార్డులో పేరు తొలిగిస్తున్నారు.. కానీ యాడింగ్ చేసే అధికారం కూడా తహసీల్దార్ సిబ్బందికి ఇస్తే సమస్యలు రావని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
ఖమ్మంఅర్బన్ 1,505, నేలకొండపల్లి 478, చింతకాని 467, ఖమ్మంరూరల్ 418, కొణిజర్ల 378, ముదిగొండ 376, కల్లూరు 365, బోనకల్ 325, తల్లాడ 275, సింగరేణి 272, మధిర 263, రఘునాధపాలెం 245, వైరా 233, కామేపల్లి 210, సత్తుపల్లి 185, కూసుమంచి 174, వేంసూరు 154, పెనుబల్లి 150, తిరుమలాయపాలెం 110, ఏన్కూరు 76, ఎర్రుపాలెం 56 మొత్తం ఖమ్మం జిల్లాలో 6,717 దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్తకార్డుల కోసం చేసుకున్నారు. వీటికి సంబంధించి కుటుంబ సభ్యులు 19,867 మంది ఉన్నారు. ఇవన్నీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో చూపిస్తున్నవి. ఇవిఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టిన ఆరు పథకాలకు సంబంధించి స్వీకరించిన వాటిలో రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన గ్రామసభల్లో 66,115 దరఖాస్తులు వచ్చాయి.