– సర్కారు వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17 : ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సత్వరం విడుదల చేయాలని ఖమ్మం రూరల్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం, ఐకెపి, విద్యాశాఖ తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు ప్లకార్డ్స్ ధరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి రెండేళ్లు గడిచినప్పటికీ నూతన పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ రెండేళ్ల కాలంలో అనేకమంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పటికీ వారికి రావాల్సిన ప్రోత్సాహకాలు అందడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలకు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. జూన్ 2వ తేదీలోగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని, లేనియెడల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలతో పాటు పెన్‌డౌన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నేత గంట రవీంద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.శ్రీదేవి, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ పద్మావతి, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.