అశ్వారావుపేట రూరల్, జూలై 20 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అశ్వారావుపేట మండలం ఆగం.. ఆగం అయ్యింది. వరుణుడి ప్రతాపంతో ముఖ్యంగా గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, రంగాపురం, అనంతారం, నారాయణపురం గ్రామ పంచాయతీల్లోని రైతన్నలకు కొండంత శోకం మిగిలింది. వేలాది మంది రైతన్నల కడుపు నింపే వరప్రదాయిని, అన్నపూర్ణ లాంటి పెదవాగు ప్రాజెక్టు రూపమే మారిపోయింది. ఇటీవలే ప్రాజెక్టు మరమ్మతుల కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.కోటీ 20లక్షల నిధులు నీటిపాలయ్యాయి.
ఎటుచూసినా పత్తి, వరి, కూరగాయలు, పామాయిల్ వంటి పంటలు ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాలకు రైతన్నలు వేసుకున్న విద్యుత్ స్తంభాలు ముక్కలు ముక్కలుగా విరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు వరదకు కొట్టుకుపోయాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు ఛిద్రంగా మారాయి.. పలుచోట్ల గండ్లు పడ్డాయి. మూగజీవాలు కొట్టుకుపోయాయి. ప్రజలంతా మూడోరోజు కూడా అంధకారంలోనే మగ్గుతున్నారు. పారిశుధ్యం పడకేయడంతో రోగాల బారినపడతామనే ఆందోళన చెందుతున్నారు
పెదవాగు ప్రాజెక్టు 3 కిలోమీటర్లు ఆనకట్ట పొడవు కలిగి ఉంది. ఈ ఆనకట్టకు మూడుచోట్ల గండ్లు పండి నీరంతా బయటకు వెళ్లిపోవడంతో ఆయుకట్టు రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్నాళ్లు తమ కడుపు నింపిన వరప్రదాయిని మళ్లీ తిరిగి అన్నం పెడుతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఉండి ఆంధ్రప్రదేశ్ 80 శాతం, తెలంగాణ 20 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ర్టాల ప్రాజెక్టు కనుక ఇరు ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేసి ఆధునీకరణ పనుల కోసం నిధులు కేటాయిస్తారా.. అని ఆందోళన చెందుతున్నారు. కాగా.. గతంలో రైతులపై మమకారంతో మాజీ సీఎం కేసీఆర్ గేట్ల ఆధునికీకరణ కోసం రూ.కోటి 20లక్షల నిధులు మంజూరు చేశారు.
గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురం గ్రామాల్లోని రైతులు వరినాట్లు వేసేందుకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. ఈలోపే వరదల కారణంగా భూముల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో ఈ ఏడాది బీడు భూములుగా మిగులుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుకను తొలగించటం, గుంతలను పూడ్చటం వంటి పనులు చేపడితే ఎకరానికి రూ.50 వేల నుంచి లక్షకు పైగా ఖర్చు అవుతుందని, దీనికి ప్రభుత్వం సాయం అందించాలని వేడుకుంటున్నారు.