ఖమ్మం అర్బన్, మే 29: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో గురువారం ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేశ్ మాట్లాడుతూ పేద విద్యార్థులు బాత్రూంలు శుభ్రం చేసుకోవాలని, వంట చేసుకోవాలని, ఊడ్చుకొని తూడ్చుకోవాలని అంటూ ఒక ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
దళిత విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం అంటే.. నిరుపేద దళిత విద్యార్థులను అవమానించడమేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, యశ్వంత్, సందీప్, ప్రణవ్, ప్రసాద్, జీవన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
దళిత విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని విధుల నుంచి బహిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే శుభ్రం చేసుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనతోనే ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలుగు వర్షిణిని విధుల నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.