ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 25: ‘విద్యారంగంపై ఇంత వివక్షా?’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం పట్ల మండిపడ్డారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద బడ్జెట్ ప్రతులను దహనం చేసిన అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3 శాతం నిధులు మాత్రమే కేటాయించడం, పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్మెంట్ ప్రస్తావన లేకపోవడం, జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించకపోవడం దారుణమని అన్నారు. ముగ్గురు మంత్రులున్నా జిల్లాకు యూనివర్సిటీ తేకపోవడం శోచనీయమని అన్నారు. పీడీఎస్‌యూ నాయకులు వెంకటేశ్, వంశీ, కిరణ్, సాయి, అనిల్, గణేష్, వెంకటేష్ పాల్గొన్నారు.
విభజన హామీ ప్రకారం తెలంగాణకు కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విద్యారంగ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించలేదని, పేద విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించలేదని ఆరోపిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం నాయకులు ఇటికాల రామకృష్ణ, శివనాయక్, రాకేశ్, ప్రతాప్‌రాజు, రోహిత్, బాలాజీ, నరేశ్సాయి తదితరులు పాల్గొన్నారు.