దసరా వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు సంబురమే సంబురం. విద్య, ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పండుగకు తమ ఇళ్లకు చేరుకుంటారు. పండుగను ఆసాంతం ఆనందంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో ఆర్టీసీ మాత్రం వారికి చుక్కలు చూపిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు చేరుకునేందుకు సరిపడా బస్సులు ఏర్పాటుచేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండడంతో వారు మూడింతలు చార్జీలతో దోచుకుంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిల్చోవడానికి కూడా చోటులేక ప్రయాణం మరింత కష్టతరంగా మారింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో దసరా పండుగ వేళ ప్రయాణికులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం దసరా పండుగ వేళ ముందస్తు చర్యలు తీసుకునేది. ప్రయాణికుల సంఖ్యను అంచనా వేసి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి అదనంగా బస్సులను నడిపేది. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రజల ప్రయాణం సాఫీగా జరిగేది. కానీ.. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ యాజమాన్యం సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ బస్సుల్లో ఎక్కువగా రిజర్వేషన్లే ఉండడం వల్ల సీట్లు దొరకడం లేదని సామాన్యులు వాపోతున్నారు. గంటలకొద్దీ రోడ్లపై కుటుంబంతో పడిగాపులు కాసినా బస్సులు రావడం లేదని, వచ్చినా నిండుగా ఉండి ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సులు కిక్కిరిస్తున్నాయి. ఈ పథకం వల్ల సాధారణ రోజుల్లోనే ప్రయాణం భారంగా ఉంటుందంటే పండుగ వేళ ఇక చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.