పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖమ్మం జిల్లా ఓటర్లు పోటెత్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ముందుగానే సొంతూళ్లకు చేరుకున్నారు. అందరూ కలిసి సోమవారం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఎడతెగని బారులు కన్పించాయి. మధ్యాహ్నం వేళ మండుటెండలోనూ పొడవాటి క్యూ లైన్లు దర్శనమిచ్చాయి.
ప్రజాప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు సహా ప్రముఖులందరూ తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చి సిరా చుక్కను చూపించారు. వృద్ధులు, మహిళల కోసం పలు చోట్ల ఏర్పాటుచేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మోడల్ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మహిళా ఓటర్లను ఎన్నికల సిబ్బంది పూలతో ఆహ్వానించారు. గ్రీన్ కార్పెట్‌తో స్వాగతం పాలికారు.
ఆయా పోలింగ్ కేంద్రాలను మామిడి తోరణాలతో అలంకరించారు. అక్కడి పోలింగ్ సిబ్బంది కూడాప్రత్యేకమైన ఏకరూప దుస్తులు ధరించి విధులు నిర్వహించారు. మొత్తంగా పటిష్ట భదత్రా ఏర్పాట్ల మధ్య పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్న వారిని అధికారులు ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకూ పోలింగ్ కొనసాగింది. ప్రతి పోలింగ్ బూత్నూ వెబ్ కాస్టింగ్‌కు అనుసంధానం చేసిన ఉన్నతాధికారులు.. జిల్లా కేంద్రం నుంచి పోలింగ్‌ను పర్యవేక్షించారు.